తెరాసకు ఎమ్మెల్సీ అభ్యర్థి దొరకనందునే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు వాణీదేవిని అభ్యర్థిగా ప్రకటించారని... ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శించారు. ఆమె ఓడిపోతే ఆ ఓటమిని పీవీ ఖాతాలో వేయవచ్చనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ఆయనతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, దేవరకద్ర ఇంఛార్జ్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి నాంది...
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా సుదీర్ఘ అనుభవం ఉన్న చిన్నారెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. చిన్నారెడ్డి గెలుపు రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వానికి నాంది కావాలని అన్నారు. గతంలో ఎమ్మెల్సీలుగా పని చేసిన రాంచందర్ రావు, నాగేశ్వరరావులు శాసనమండలిలో ఎప్పుడూ సమస్యల గురించి చర్చించలేదని విమర్శించారు.
కేసీఆర్ ఇంటి ముందు దీక్ష చేస్త...
సురభి వాణిదేవి అయినా స్వయంగా సీఎం కేసీఆర్ పోటీ చేసినా ఎమ్మెల్సీగా ఓడిపోవడం ఖాయమని... ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి పేర్కొన్నారు. తాను నూరుశాతం విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్ రావు నిరుద్యోగుల సమస్యను పట్టించుకోలేదని... మళ్లీ ఎలా ఓట్లు ఆడుగుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ కోసం పోరాడతానని అన్నారు. అవసరమైతే కేసీఆర్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు.
ఇదీ చదవండి: అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్ అన్నం.. గ్రామస్థుల ఆందోళన