Medigadda Barrage Issue Update News : కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ(Medigadda Lakshmi Barrage)లోని కుంగిన పిల్లర్‌ను.. రాష్ట్ర ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ తిరుపతిరావు, ఇతర అధికారులు.. ఎల్ అండ్ టీ ఇంజినీరింగ్ నిపుణులు పరిశీలించారు. అనంతరం తక్షణమే తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. జలాశయంలో ఉన్న నీటిని.. కిందకు విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీలో 2 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా.. పై నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లుగా కిందకు వదులుతున్నారు. బ్యారేజీలోని 20వ నంబర్ పిల్లర్.. అడుగున్నర మేర కుంగిందని.. బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు తెలిపారు. నెల రోజుల్లో మరమ్మతులు పూర్తి చేస్తామని వివరించారు.
'2019లో ఈ బ్యారేజీని నిర్మించాం. డ్యామ్ డిజైన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రస్తుతం వరద ప్రవాహం కొనసాగుతోంది. అది తగ్గగానే.. ప్రమాదం ఎలా జరిగిందని పరిశీలిస్తాం. బ్యారేజీకి ఎలాంటి నష్టం జరిగినా ఎల్ అండ్ టీనే భరించి మరమ్మతు చేస్తుంది. దీన్ని గత ఆకారంలోకి తీసుకువచ్చే బాధ్యత మాదే.' -సురేష్ కుమార్, ఎల్ అండ్ టీ ఇంజినీర్
Etela Rajender Reaction on Medigadda Project : ముఖ్యమంత్రి కేసీఆర్.. కలలు కన్న కాళేశ్వరం ప్రాజెక్టు నీటి పాలయ్యిందని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. బ్యారేజీ సందర్శనకు వెళ్లగా.. పోలీసులు ఈటలను అనుమతించారు. బ్యారేజీని పరిశీలించిన అనంతరం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Opposition on Medigadda Project Issue : "మేడిగడ్డ బ్యారేజీపై సమగ్ర విచారణ జరిపించాలి"
Congress Leader Fire on Medigadda Project : ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్‌ను రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చి నాణ్యత లోపంతో మేడిగడ్డ బ్యారేజీను నిర్మించడం వల్లే కుంగిందని.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై కేంద్రం ఎందుకు న్యాయ విచారణ చేయడం లేదని డిమాండ్ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ జరిగింది : కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన ఒక్కసారిగా కొంతమేరకు కుంగింది. శనివారం రాత్రి సమయంలో భారీ శబ్దంతో బి-బ్లాకులోని పిల్లర్ల మధ్య ఉన్న వంతెన కుంగిపోయింది. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా.. ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పై నుంచి రాకపోకలు నిలిపివేశారు. గోదావరి నదిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ వద్ద 2019లో ఈ బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో ఇది మొదటిది.
రెండు రాష్ట్రాల సరిహద్దులను కలిపే వంతెన కుంగడంతో.. పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాకపోకలు నిలిపివేశారు. భారీ శబ్దం నేపథ్యంలో డ్యాం ఇంజినీర్లు మహారాష్ట్ర వైపు సిరోంచ, తెలంగాణ వైపు మహదేవపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎల్ అండ్ టీ గుత్తేదారు సంస్థ నిపుణులు కూడా అర్ధరాత్రికి మేడిగడ్డ చేరుకుని పరిస్థితి సమీక్షించారు.