భూపాల్ పల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ గోదావరి అతిథి గృహంలో వరంగల్ సర్కిల్ అటవీశాఖ ఎం.జె.అక్బర్ అధ్యక్షతన అంతర్రాష్ట్ర, అటవీ వనరులు, వన్యప్రాణుల సంరక్షణ అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు చెందిన అటవీ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా పెద్ద పులి సంచారం, రక్షణపై చర్చించారు.
అటవీ భూముల సంరక్షణలో భాగంగా అన్ని స్థాయిల్లోను అధికారులు సమన్వయంతో పనిచేయాలని అటవీ శాఖ సంరక్షణ అధికారి శోభ సూచించారు. గ్రామ పంచాయతీ నుంచి జిల్లా స్థాయి వరకు అమలవుతున్న ప్రభుత్వ పథకాలకు... అటవీశాఖ వల్ల ఇబ్బంది కలగకుండా పనులు చేయాలని తెలిపారు. అటవీ సంపద రక్షణ కోసం అడవుల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ స్థాయిలో ఉన్న అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో అదనపు ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి ఎస్.ఎం.మురళి, జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం, టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యనారాయణ, 13 జిల్లాల అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్