జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని భూపాలపల్లి, ఘనపూర్, రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాలో వరి, మొక్కజొన్న ఇంకా కొనుగోలు కేంద్రాల వద్దే ఉంది. వర్షాలకు ధాన్యం నాని.. మొలకెత్తుతున్నా.. అధికారులు కాంట వేసి ధాన్యం మిల్లుకు తరలించడంలో జాప్యం చేస్తున్నారని రైతులు ధర్నాకు దిగారు.
వడ్లు తడిసి మొలకెత్తుతున్నా.. పట్టించుకునే నాధుడు కరువయ్యారంటూ.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అమ్మడానికి పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామ శివారులో ప్రధాన జాతీయ రహదారి మీద రైతులు వడ్ల బస్తాలను అడ్డంగా వేసి రాస్తారోకో నిర్వహించారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై నిహారిక సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతులను బుజ్జగించి నిలిచిపోయిన వాహనాలను పంపించారు. బస్తాల్లో ధాన్యం మొలకెత్తుతున్నదని, అటు పాలకులు, ఇటు అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి సరైన మద్ధతు ధర అందించాలని అన్నదాతలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'యూ ఫర్ అగ్లీ' అని నేర్పిన టీచర్లు.. సస్పెండ్!