చెరువులు, కాలువల పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. నీటిపారుదల శాఖ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని చెరువులు, ఫీడర్ కెనాల్స్, నీటిపారుదల కాలువలలో పూడికతీత, మరమ్మతులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
చెరువులు, కాలువల పూడికతీత పనులు.. ఉపాధిహామీ పనులు చేపట్టడానికి వచ్చే నెల చాలా అనుకూలమైన కాలమని కలెక్టర్ అన్నారు. దాదాపు 40 కోట్ల రూపాయల నీటిపారుదలశాఖ నిధులతో చెరువుల్లో నీటి నిలువ కెపాసిటీని పెంచడమే గాక మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో కూలీలకు అధిక సంఖ్యలో పనిని కల్పించడానికి చెరువులు, ఫీడర్ కెనాల్స్, పంట కాలువల పూడికతీత పనులు తోడ్పడతాయని తెలిపారు.
గతేడాది సాధారణానికి మించి వర్షపాతం జిల్లాలో కురవడం వల్ల బలహీనమైన చెరువులు కోతకు గురై పంట నష్టం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈసారి అలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచడంతో పాటు నిర్ణయించిన మేరకు ప్రతి మండలంలో ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్లు, టార్పాలిన్లు, ప్యాడి క్లీనర్లు, గన్నీ బ్యాగులను సమకూర్చుకొని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు.