వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీమ్ అధికారులను ఆదేశించారు. ఇటీవల వర్షాలకు వాగులు, కుంటలు, చెక్‌డ్యాంలు నిండుకుండలా మారినందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జనం వద్ద కరోనా నిబంధనలు పాటిస్తూ, తక్కువ మంది మాత్రమే నిమజ్జనంలో పాల్గొనేలా ప్రజలకు ముందస్తు అవగాహన కల్పించాలని తెలిపారు.
జిల్లా అదనపు కలెక్టర్ వై.వి.గణేశ్‌తో సమన్వయం చేస్తూ సంబంధిత శాఖల అధికారులు కాళేశ్వరం, గణపురం, భూపాలపల్లి పట్టణంలోని చెరువుల్లో వినాయకులను నిమజ్జనం చేయడానికి అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్రేన్లు, విద్యుద్దీపాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. గణేశ్ నిమజ్జనం వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని జిల్లా మత్స్యశాఖ అధికారి భాస్కర్‌ను, కాళేశ్వరంతో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో సింగరేణి రెస్క్యూ టీంను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
అధికారులు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేసి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
- ఇవీ చూడండి: హైదరాబాద్ కంపెనీలో అమెరికన్ టీకా ఉత్పత్తి!