జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలు తిరునగరి పద్మ గోడలపై పాఠ్యాంశాలను చిత్రిస్తూ పిల్లలకు చక్కగా అర్ధమయ్యేలా బోధిస్తున్నారు. పుస్తకంలోని విషయాలు నేరుగా చెప్పడం కంటే బొమ్మలు, గుర్తుల రూపంలో చూపిస్తే అవి ఎప్పటికీ గుర్తుంటాయని ఆమె అంటున్నారు. పాఠశాల పరిసరాలను తన చిత్రాలతో అందంగా మార్చేస్తున్నారు.
మహిళా సమస్యలపై పోరాటం
పద్మ బొమ్మల ద్వారా పాఠాలను బోధించటంతోపాటు సమాజంలో వివక్షకు గురవుతున్న మహిళల సమస్యలపైన తన కుంచెను ఎక్కు పెట్టారు. హన్మకొండకు చెందిన పద్మ... 2008 డీఎస్సీలో తెలుగు పండిట్‌గా ఎంపికయ్యారు. దేవరుప్పుల మండలం రామరాజుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేశారు. తర్వాత బదిలీపై సోలిపూర్ పాఠశాలకు వచ్చారు.
తనకు టీచరే స్ఫూర్తి..
ములుగులోని బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో డ్రాయింగ్ టీచర్ గీసిన చిత్రాలు పద్మను ఆకర్షించాయి. ఆ స్ఫూర్తితో తాను టీచర్ అయ్యాక... పాఠాలకు బొమ్మల రూపం కలిగించి ఇచ్చి పిల్లలకు ఆసక్తి కలిగేలా విద్యా బోధన చేస్తున్నారు. పాఠశాల సమయం పూర్తయ్యాక... ఆదివారాలు సొంత డబ్బులతో గోడలపై చిత్రాలు వేస్తున్నారు.
పాఠశాల రూపురేఖలు మారిపోయాయి
తెలుగు వ్యాకరణం, ప్రపంచ పటం, సూర్య కుటుంబం, రైలుబండి, హరితహారం, పల్లె అందాలు.. ప్రతి చిత్రం వెనుక పద్మ కష్టం, సృజనాత్మకత ఉంటాయి. మొత్తానికి ఈ చిత్రాలతో పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందిన పద్మ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డ్, సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు.
ఇవీ చూడండి: మాస్టారు వెళ్లారు.. విద్యార్థులు విలవిలలాడారు!