Custard apple in Janagama market: చలికాలంలో దొరికే పళ్లలో సీతాఫలం ప్రధానమైంది. మధురమైన రుచితోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో ఈ పండుకు డిమాండ్ అధికంగా ఉంటుంది. జనగామ జిల్లా కేంద్రంలోని మార్కెట్ సీతాఫలాలకు పెట్టింది పేరు. వేకువజామునుంచే బుట్టలతో విక్రయదారులు సీతాఫలాలను ఇక్కడకు అమ్మకానికి తీసుకొస్తారు. ఈసారి అధిక వర్షాల కారణంగా పళ్ల రాక కాస్త ఆలస్యంగానే ప్రారంభమైంది.
దానికి తోడు కోతుల బెడదతో పండ్లు దొరకడమే కష్టంగా మారిందని వ్యాపారులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే కష్టపడి మార్కెట్ కు తీసుకొచ్చిన పండ్లకు సరైన ధర రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎలాంటి రసాయనాలు వాడకుండా నాణ్యమైన పళ్లని విక్రయిస్తుండటంతో కొనుగోలుదారులు వీటిని ఇష్టంగా కొంటున్నారు.
మార్కెట్‌లో చక్కటి ఫలాలు లభిస్తాయని ప్రచారం ఉండటంతో కేవలం జనగామ మాత్రమే కాకుండా.. హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి కూడా కోనుగోలు చేస్తున్నారు. నాణ్యమైన తాజా కాయలు మాత్రం లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ మార్కెట్ నుంచి 30 నుంచి 40 లారీల లోడ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లేవి. అయితే ఈ సారి కాయల లభ్యత తక్కువ కావడంతో నాలుగైదు వాహనాలు వెళ్లడం కష్టంగా ఉందని వ్యాపారులు అంటున్నారు.
"ఈసారి సీతాఫలాలు రావడం కొద్దిగా ఆలస్యం అయ్యింది. అధిక వర్షాలతో దిగుబడి కూడా తగ్గింది. దానికి తోడు కోతులు గుంపులు గుంపులుగా చేరి మమ్మల్ని సీతాఫలాలను తీయకుండా చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం దసరా, దీపావళికి కొత్త బట్టలు కొనుక్కొని చాలా సంతోషంగా ఉండేవాళ్లం ఈసారి ఆ పరిస్థితి లేదు".- అమ్మకపుదారుడు
"జనగామ మార్కెట్ సీతాఫలాలకు పెట్టింది పేరు. ఇక్కడ సీతాఫలాలు చాలా రుచిగా ఉంటాయి. అంతే కాకుండా ఎటువంటి రసాయననాలు కలపని స్వచ్ఛమైన పండ్లు ఇక్కడ లభిస్తాయి. ప్రతి ఏడాది ఇక్కడికి వచ్చి ఎక్కుమ మొత్తంలో సీతాఫలాలు కొనుగోలు చేస్తాం. ఈసారి ఇక్కడ ధరలు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి".- కొనుగోలు దారుడు
ఇవీ చదవండి: