జగిత్యాల జిల్లా చెరుకు రైతులు ఆందోళనను ఉద్ధృతం చేశారు. మల్లాపూర్ మండలం ముత్యంపేటలో చక్కెర కర్మాగారాన్ని పునః ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. అయినప్పటికీ ఒక్కసారిగా పెద్ద ఎత్తున తరలి వచ్చిన రైతులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. బందోబస్తు ఏర్పాటు చేసినా పోలీసుల కళ్లు గప్పి ధర్నాలో పాల్గొన్నారు. జై జవాన్ జైకిసాన్ నినాదాలతో ధర్నా చేపట్టారు.
ఎక్కడికక్కడే వాహనాలు
జగిత్యాల కలెక్టరేట్ ముందు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గేందుకు రైతులు ససేమిరా అన్నారు. కలెక్టర్ వచ్చి సమస్యలు వింటేనే.. ధర్నా విరమిస్తామని భీష్మించడంతో రైతుల బృందాన్ని అనుమతించారు. సమస్యలపై కూలంకషంగా చర్చిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. ప్రభుత్వం ఫ్యాక్టరీని తెరిపించలేని పక్షంలో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ముత్యంపేట చక్కెర పరిశ్రమను పున:ప్రారంభించక పోతే అక్కడే ఆమరణ దీక్ష చేయనున్నట్లు ఫ్యాక్టరీ కార్మికులు ప్రకటించారు.
ఇదీ చూడండి: ఫ్యాక్టరీ తెరిపించాలంటూ కలెక్టర్‌కు వినతి పత్రం