కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన కిసాన్ రైలులో లింగంపేట-జగిత్యాల రైల్వేస్టేషన్ నుంచి మామిడికాయల లోడును దిల్లీలోని ఆదర్శనగర్‌కు రవాణా చేశారు. కిసాన్ రైలు ద్వారా తక్కువ ఖర్చుకే తమ మామిడి కాయలు దిల్లీ చేరడంతో స్థానిక రైతులు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అత్యధికంగా మామిడిసాగు చేసే జిల్లాల్లో జగిత్యాల జిల్లా ఒకటి. రాష్ట్రంలో జగిత్యాల అతిపెద్ద రెండో మామిడి మార్కెట్‌గా నిలుస్తుంది. ఇక్కడి నుంచి ప్రతి ఏటా రూ.300 కోట్ల మామిడి వ్యాపారం సాగుతోంది. జిల్లాలో సుమారు 35 వేల ఎకరాల్లో మామిడి సాగవుతుండగా.. 1.30 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. జగిత్యాల జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మామిడి కాయలను ఇక్కడికే అమ్మకానికి తీసుకొస్తారు. ఇంత పెద్ద మార్కెట్ ద్వారా ఇన్నాళ్లు లారీల ద్వారా దిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలకు మామిడి ఎగుమతి అయ్యేది.
రైతులు, వ్యాపారుల హర్షం..
అయితే కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్ రైలు ద్వారా 50 శాతం ధరలోనే కోరుకున్న ప్రాంతానికి సరుకును ఎగుమతి చేసుకునే వీలుండటంతో తొలిసారిగా లింగంపేట-జగిత్యాల రైల్వేస్టేషన్ నుంచి 476 టన్నుల మామిడి కాయలు దిల్లీలోని ఆదర్శ్‌నగర్‌కు రవాణా చేశారు. ఇదే సరుకును లారీల ద్వారా తరలించాలంటే సుమారు రూ.22 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం కిసాన్ రైలు ద్వారా రూ.9 లక్షలకే సరుకు దిల్లీ చేరుకోవడంతో మామిడి రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాలకు చేరుకున్న వ్యాపారులు..
మరోవైపు జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్‌గల్ మార్కెట్‌లో మామిడి వ్యాపారం మొదలైంది. రైతులు పెద్ద ఎత్తున మార్కెట్‌కు కాయలు తెస్తున్నారు. కిసాన్ రైలు అందుబాటులోకి రావటం వల్ల ధర ఎక్కువ వచ్చే అవకాశం ఉందని మామిడి వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే మామిడి కాయలు కొనేందుకు దిల్లీ, మహారాష్ట్ర, హర్యానా నుంచి వ్యాపారులు పెద్దసంఖ్యలో జగిత్యాలకు చేరుకున్నారు.
ఇదీ చూడండి: మాయ మాటలు చెప్పేవారిని మళ్లీ నమ్మొద్దు: జానారెడ్డి