మొక్కల కోసం దారినే మార్చుకున్నారు... ప్రభుత్వం హరిత తెలంగాణకు ఇస్తున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఇదే స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలు, అధికారులు కొనసాగిస్తున్నారు. మొక్కలు నాటడం ఒక ఎత్తైతే వాటిని జాగ్రత్తగా పెరిగే వరకు పరిరక్షించడం మరో ఎత్తు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని రాజేశ్వరరావు పేట వద్ద అధికారులు చేసిన పని అందరికి కనువిప్పుగా కనిపిస్తోంది. రాజేశ్వరరావు పేటలో కాళేశ్వరం పంప్ హౌజ్‌కు వెళ్లేందుకు దారి నిర్మించారు. వరద సమయంలో మట్టి పేరుకు పోవడం వల్ల దాన్ని తీసి పక్కనే పోశారు. గుట్టగా ఏర్పడిన మట్టిపై మెక్కలు మొలిసి చెట్లుగా మారాయి. ప్రస్తుతం దారి కోసం ఆ గుట్టను తొలగించే ప్రక్రియ ప్రారంభించారు.
ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏపుగా పెరిగిన పచ్చని మొక్కలను కాపాడుకుందాం అంటూ అధికారులు హరిత స్ఫూర్తిని చాటుతున్నారు. కానీ ఎత్తైన గుట్టపై మూడు పచ్చని మొక్కలు ఉన్న విషయాన్ని గమనించిన అధికారులు మొక్కలను తొలగించకుండా చుట్టూ గట్టు మట్టిని తొలగించి జాగ్రత్త తీసుకున్నారు. ప్రస్తుతం ఎత్తయిన గుట్టపై ఏపుగా పెరిగిన పచ్చని మొక్కలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అటు వైపు నుంచి వెళ్తున్న ప్రజలు మొక్కలను చూస్తూ అనందిస్తున్నారు. రివర్స్ పంప్ హౌస్ వద్ద ఈ మొక్కల గుట్ట ఒక ఆకర్షణతో పాటు అధికారుల ఆలోచన స్ఫూర్తిగా నిలుస్తోంది.
ఇవీచూడండి: చింపాంజీలను స్వాధీనం చేసుకున్న ఈడీ- ఎందుకంటే