Controversy in Jagtial Highway works: జగిత్యాల నుంచి కరీంనగర్ మీదుగా కోదాడ వరకు నిర్మించ తలపెట్టిన జాతీయరహదారి భూసేకరణ అడుగు ముందుకుపడటం లేదు. రోడ్డు విస్తరణ వల్ల చాలా మంది నష్టపోతున్నారనే కారణంతో గొల్లపల్లి మీదుగా మార్చనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ ప్రాంత రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరించడం వల్ల మరోసారి మరోసారి పాత తరహాలోనే నిర్మాణానికి ప్రభుత్వం నడుం బిగించడంతో... మరోసారి బాధితుల్లో ఆందోళన మొదలయ్యింది. మిషన్ భగీరథ పైప్ లైన్ ఉందన్న కారణంగా ఒకేవైపు విస్తరణ చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
నాలుగేళ్లుగా వివాదాలతో నలుగుతున్న భూసేకరణ..
వాహనాల రద్దీ దృష్ట్యా జగిత్యాల నుంచి కోదాడ రోడ్డును జాతీయ రహదారిగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళిక రూపొందించింది. రోడ్డు విస్తీర్ణం పెంచేందుకు చేపట్టిన భూసేకరణ... నాలుగేళ్లుగా వివాదాలతో నలుగుతోంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ వద్ద భూసేకరణ వివాదం తారాస్థాయికి చేరింది. ఈ ప్రాంతంలోని భూములు అత్యంత విలువైనవి కావడంతో రోడ్డును రెండు వైపుల విస్తరించాలని గ్రామస్తులు పట్టుబడుతున్నారు. రోడ్డును రెండు వైపుల కాకుండా ఒకేవైపు విస్తరిచడం వల్ల విలువైన భూములు, ఇళ్లు, దుకాణాలు కోల్పొతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ కారణంగా ఒకే వైపు భూమిని తీసుకోవడమే వివాదానికి కారణంగా మారింది. రెండు వైపులా రోడ్డు విస్తరణ చేపట్టాలని లేదంటే... గ్రామం వెలుపలి నుంచి బైపాస్ నిర్మించాలని స్థానికులు పట్టుబడుతున్నారు.
అభివృద్ధిని అడ్డుకోమంటున్న నిర్వాసితులు..
జాతీయ రహదారిగా ప్రకటించడమే తప్ప ఇంత వరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. భూసేకరణ సైతం ఇంకా మొదలవలేదు. ఈ మార్గంలో ఇరుకైన కల్వర్టులు ఉండటం వల్ల వాహనచోదకులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. నిజామాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం వెళ్లే భారీ వాహనాలతో నిత్యం కిక్కిరిసి ఉంటోంది. నాలుగేళ్ల క్రితం జాతీయ రహదారి మంజురైనా ఒక్క అడుగు ముందుకు పడలేదు. ప్రస్తుతమున్న రోడ్డు మరమ్మతులను రహదారులు భవనాలశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రహదారిపై అడుగడుగునా గోతులు ప్రయాణికులకు నరకయాతన చూపిస్తున్నాయి. అభివృద్ధిని అడ్డుకోమంటున్న నిర్వాసితులు మొత్తం భూములు పోకుండా చూడాలని కోరుతున్నారు. తొలుత ప్రత్యామ్నాయం చూపాలని.. లేదంటే మెరుగైన పరిహారం ఇవ్వాలని వేడుకుంటున్నారు.
జగిత్యాల నుంచి కోదాడ వరకు నిర్మించ తలపెట్టిన జాతీయరహదారి బాణంలా ఉండాలనే ఉద్దేశంతో ఇంజినీర్లు భూసేకరణ చేపట్టారు. దీంతో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్నాము. పంటపొలాలు సైతం పోతున్నాయి. ఇప్పుడున్న రోడ్డుకు రెండు వైపుల 50 లేదా 100 ఫీట్ల వరకు విస్తరణ చేపట్టి జాతీయరహదారి నిర్మిస్తే రోడ్డు పక్కన ఉన్న మా లాంటి గృహస్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.- బాధితుడు
ఇదీ చదవండి: TSRTC Good news: న్యూఇయర్ సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్..