దేశం మొత్తం కరోనా రోగులకు ఉచితంగా వైద్యం అందుతుంది గానీ తెలంగాణలో మాత్రం పేదలు వైద్యం కొనుక్కొవాల్సిన పరిస్థితి నెలకొందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ కరోనా నివారణ కోసం ఎన్ని కోట్లయిన ఖర్చు చేస్తామని చెబుతున్నా.. కోఠి ఈఎన్‌టీ, టీమ్స్ ఆస్పత్రిలో కనీసం సీటీ స్కాన్ కూడా ఏర్పాటు చేయపోవటం ఆశ్చర్యం కల్గిస్తోందన్నారు. 50 వేల తాత్కాలిక ఉద్యోగాలు ఎంపిక చేస్తామని ప్రకటించిన సీఎం పక్షం రోజులైన ఆ ఊసేలేదన్నారు.
రాష్ట్రంలో ప్రకటిస్తున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యకు జిల్లాలో ప్రకటిస్తున్న సంఖ్యకు పొంతన లేకుండా ఉందని.. కేసులను దాచి ప్రభుత్వం చూపిస్తుందన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చటంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా పరీక్షల కోసం వచ్చే వారికి పూర్తి స్థాయిలో పరీక్షలు చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.