రాష్ట్రంలో ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఎందుకు ఊడిపోతుందో తెలియని పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యోగులు ఉన్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల అన్నారు. ఒక ఉద్యోగం ఇవ్వరు కానీ.. యథేచ్ఛగా ఉద్యోగాలు తొలగిస్తున్నారని మండిపడ్డారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు ఇందిరాపార్క్ వద్ద చేస్తున్న దీక్షకు వైఎస్.షర్మిల సంఘీభావం ప్రకటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది మార్చిలో 7,561 మంది ఉద్యోగాలు తొలగించారని.. ఆ సమయంలో సమ్మె చేశారనే అక్కసుతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించారని వైఎస్.షర్మిల మండిపడ్డారు. వీళ్లకు నెలకు ఇచ్చే జీతం రూ.9,000లు మాత్రమే అని.. తమకు జీతాలు తక్కువ వస్తున్నాయని సమ్మె చేసినందుకు తొలగించారని గుర్తు చేశారు. మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి రూ.25,000ల చొప్పున వైఎస్సార్టీపీ అందజేస్తుందని వైఎస్.షర్మిల హామీ ఇచ్చారు.
ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారు..
‘‘'ప్రజల గురించి పట్టించుకోని కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు. కేవలం ప్రశ్నించినందుకు 7,560 కుటుంబాలను రోడ్డున పడేశారు. ప్రశ్నించడం తెలంగాణ సిద్ధాంతం.. విధానం.. నినాదం. అది మర్చిపోయి ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వాళ్లను ఇబ్బందులు పెట్టారు. ఆర్టీసీ సంఘాలను కేసీఆర్ నిర్వీర్యం చేశారు. ప్రశ్నిస్తే ఎందుకంత అసహనం? మాట్లాడేవారికి వైఎస్సార్ మైక్ అందించి మరీ సమస్యలు చెప్పుకొనే అవకాశం ఇచ్చేవారు. కేసీఆర్‌ను కలిసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలకే అవకాశం ఉండటం లేదు.. అలాంటిది ప్రజలకెక్కడిది? ప్రశ్నించే వారు లేరనుకున్నారా?మేం వచ్చాం. ప్రజల తరఫున అన్ని సమస్యలపైనా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోరాడుతుంది'
-వైఎస్ షర్మిల, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు ’
YS SHARMILA: కేసీఆర్.. ప్రశ్నిస్తే ఎందుకంత అసహనం?: షర్మిల
2006 నుంచి ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్నామని తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్ల ఐకాస ఛైర్మన్ ముదిగొండ శ్యామలయ్య తెలిపారు. గ్రామాల్లో ఉండే కూలీలకు అందుబాటులో ఉండి ఉపాధి హామీ పథకం అమలయ్యేందుకు తాము కృషిచేస్తున్నామన్నారు. గత ఏడాది మార్చి 22వ తేదీన తమను విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. 17 నెలల నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తమను విధుల్లోకి తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కాలంలో సుమారు 48 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మరణించారని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చదవండి: Huzurabad: హుజూరాబాద్ తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్.... ఖరారు చేసిన కేసీఆర్