YS Sharmila Letter to Opposition Parties: నిరుద్యోగుల పక్షాన పోరాటానికై కలిసి రావాలని ప్రతిపక్ష పార్టీలకు.. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖలు రాశారు. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి వారి కోసం పోరాడే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జాయింట్ యాక్షన్ కమిటీ ఇప్పుడు చారిత్రక అవసరమని తెలిపారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, టీజేఎస్ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం,.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, మందకృష్ణ మాదిగ, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు, ఎన్.శంకర్ గౌడ్‌లకు షర్మిల లేఖలు రాశారు.
అత్యంత ప్రముఖమైన పార్టీలకు ముఖ్య ప్రతినిధులుగా, ప్రజాసమస్యలపై ఎల్లప్పుడూ మీరు చేస్తున్న ఉద్యమాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని వైఎస్ షర్మిల అన్నారు. పేపర్ లీకేజీపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తీవ్రమైన నిరాశ, నిసృహలలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒక ఉమ్మడి కార్యాచరణను రూపొందించి మోసపోయిన నిరుద్యోగులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని వైఎస్ షర్మిల చెప్పారు.
తెలంగాణ భవిత కోసం, యువత కోసం కలిసి నడుద్దాం: ఒక జాయింట్ ఆక్షన్ కమిటీని ఏర్పాటు చేసి.. పోరాటాల వ్యూహాలను అమలుపర్చాలని వైఎస్ షర్మిల తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు నిరుద్యోగ సమస్యపై వివిధ పద్ధతుల్లో పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ నేడు అందరం ఒక తాటిపైకి వచ్చి నిలబడాల్సిన సరైన సమయం ఇదేనని చెప్పారు. తెలంగాణ భవిత కోసం, యువత కోసం.. కలిసి నడుద్దాం, నిలిచి పోరాడదామని లేఖలో వైఎస్ షర్మిల ప్రస్తావించారు.
మరోవైపు నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిలకు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై ఉమ్మడిగా పోరాడదామని కోరారు. ఈ మేరకు ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామన్న షర్మిల.. ప్రగతిభవన్ మార్చ్‌కు పిలుపునిద్దామని సూచించారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని పేర్కొన్నారు. షర్మిల సూచనలకు మద్దతు తెలిపిన బండి సంజయ్.. ఉమ్మడి పోరాటంపై త్వరలోనే సమావేశమవుదామని తెలిపారు. ప్రతిపక్షాలు కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందన్న రేవంత్‌రెడ్డి.. పార్టీ నేతలతో చర్చించిన అనంతరం ఉమ్మడి పోరాటంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.
ఇవీ చదవండి: 'మనం కలిసి పోరాడదాం'.. బండి సంజయ్, రేవంత్‌లతో వైఎస్ షర్మిల
కేసీఆర్‌కు...మోదీని తిట్టడం తప్ప వేరే పని లేదు: బండి సంజయ్
కాంగ్రెస్ అవినీతిపై బీజేపీ స్పెషల్ 'సినిమా'.. మొదటి ఎపిసోడ్ రిలీజ్!