కోరిన కోర్కెలు తీర్చే కొండంత దేవుడిగా....పర్యావరణ పరిరక్షకుడైన లంబోదరుడికి ఏటా ఘన స్వాగతం పలుకుతోంది యువతరం. కొంతమంది యువతీ యువకులు మాత్రం వినూత్న పంథాలో ముందుకు సాగుతున్నారు.
కాలుష్యాన్ని చూసి చలించి...
వికారాబాద్ జిల్లా చాపలగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి స్వామి ఏకంగా తన గ్రామంలో మట్టి విగ్రహాల తయారీ కేంద్రాన్ని స్థాపించాడు. పీవోపీ విగ్రహాల వల్ల కాలుష్యాన్ని కడుపున నింపుకున్న హుస్సేన్ సాగర్‌ను చూసి చలించిన స్వామి తన వంతు బాధ్యతగా మట్టి విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టాడు. తను నేర్చుకున్న విద్యను గ్రామస్థులకు నేర్పించి ఏటా లక్షలాది మట్టి గణపతులను తయారు చేసి ఉచితంగా పంచుతున్నాడు. అంతేకాకుండా నగరంలోని పలు స్వచ్చంద సంస్థల సహకారంతో మట్టి గణపతుల ప్రాధాన్యతను వివరిస్తూ పర్యావరణ హితాన్ని కాంక్షిస్తున్నాడు.
ప్రతిభతో ఉపాధి
భూదాన్ పోచంపల్లికి చెందిన భాస్కర్ గత ఐదేళ్లుగా మట్టి గణనాథులను అందంగా తీర్చిదిద్దుతూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ప్రజలను ఆకర్షిస్తోన్న పీవోపీ విగ్రహాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా మట్టి గణపయ్యలను తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. మట్టి గణపతులు తయారు చేసిన మొదట్లో నష్టాలను చవిచూసిన భాస్కర్... రెండేళ్ల కింద హయత్ నగర్ సమీపంలోని మిట్టి ఆర్ట్స్ ఏర్పాటు చేసిన కేంద్రంలో చేరి తన ప్రతిభను చాటుకుంటున్నాడు. వేలాది మట్టి గణపతులను సహజ రంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ప్రజలు వాటిని కొనుగోలు చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
సరికొత్త ఒరవడికి శ్రీకారం
హైదరాబాద్‌లోని మోతీనగర్‌కు చెందిన విశాల వినూత్న రీతిలో వినాయక భక్తులను ఆకర్షిస్తోంది. వినాయక చవితి పరమార్థాన్ని ప్రత్యక్షంగా వివరించేందుకు మట్టి విగ్రహాలకు మొక్కలను జత చేసి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. 2016 నుంచి మట్టి విగ్రహానికి మొక్కను జోడించి ఇవ్వడం వల్ల నగరంలో చాలా మంది మట్టి విగ్రహాల పట్ల ఆకర్షితులవుతున్నారు. 'షేర్ ఏ సర్వీస్' అనే స్వచ్చంద సంస్థను నిర్వహిస్తోన్న విశాల...ప్రజలంతా వినాయక చవితిని పర్యావరణ హితంగా జరుపుకోవడానికి తనదైన శైలిలో అవగాహన కల్పిస్తోంది. మట్టి గణపతుల ప్రతిష్టాపనకు ప్రభుత్వం కూడా మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉందని విశాల అభిప్రాయపడుతోంది.
గణనాథుడి ముందు అల్లరి చేష్టలే కాదు... పర్యావరణ పరిరక్షణ కోసం ఇలాంటి యువత కృషి చేస్తున్న తీరుతో నగరంలో చాలా మంది ప్రజలు మట్టి గణపతులను కొలువుతీర్చేందుకు ఆసక్తి చూపుతుండటం హర్షనీయం.
ఇవీ చూడండి: అది బడి కాదు... ప్రకృతి అందాలు, కళాత్మక చిత్రాలకు నిలయం..