ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల నేపథ్యంలో ఉన్న పాత జోనల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, తెలంగాణలోని అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షల మేరకు నూతన జోనల్ వ్యవస్థ (new zonal system) రూపుదిద్దుకుందని మంత్రి కేటీఆర్ (minister KTR) అన్నారు. రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. దీనితో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కుతాయని చెప్పారు.
స్థానికులకు న్యాయం..
జిల్లాలను ప్రత్యేక జోన్లుగా వర్గీకరించడం వల్ల జిల్లా స్థాయి పోస్టులైన జూనియర్ అసిస్టెంట్ మొదలు.... జోనల్, మల్టీ జోన్ వరకు అన్ని స్థాయిల ఉద్యోగాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల స్థానికులకు న్యాయం జరుగుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కొత్తగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణపేట జిల్లాలను ఆయా జోన్లలో చేర్చి చట్టబద్ధం చేయడంతో పాటు, వికారాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు ఆ జిల్లాను చార్మినార్ జోన్ పరిధిలోకి తేవడం పట్ల ఆయా జిల్లాల ప్రజల తరఫున ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం... ఇచ్చిన హామీలకు మించి వివిధ శాఖల ద్వారా 1,33,000 పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర యువతకు అందించామని చెప్పారు.
ప్రైవేటు రంగంలో భారీగా ఉద్యోగాలు..
కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే కాకుండా గత ఏడేళ్లలో టీఎస్ఐపాస్ ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు, వేల పరిశ్రమలు రాష్ట్రంలోకి ఆకర్షించినట్లు కేటీఆర్ తెలిపారు. తద్వారా సుమారు 15 లక్షల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో వచ్చాయని అన్నారు. ప్రైవేట్ కంపెనీల్లో స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగాలు ఇస్తే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేలా మరో విధానపరమైన నిర్ణయం తీసుకున్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు రంగాల్లో స్థానిక యువతకు అత్యధిక ఉపాధి అవకాశాలు దొరికేలా చర్యలు తీసుకుటున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు (CM KCR)... రాష్ట్ర ప్రజలు, యువత పక్షాన మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: కానిస్టేబుల్ నిజాయతీ.. సీపీ అంజనీ కుమార్ ప్రశంస!