రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత సీఐసీ రాజా సదారాం ఈనెల 24న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్తవారిని ప్రభుత్వం నియమిస్తుందా లేక ప్రస్తుతమున్న ఆరుగురు కమిషనర్లలో ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తుందా అనేది ఇంకా తేలలేదు.
మూడేళ్లకే పదవీ విరమణ
సీఐసీ లేదా కమిషనర్‌గా నియమితులైన వారు ఐదేళ్ల పాటు ఆ పదవిలో ఉంటారు. ఈలోగానే వారికి 65 ఏళ్లు నిండితే పదవీ విరమణ చేయాలి. రాజా సదారాం సీఐసీగా నియమితులై మూడేళ్లే అయినప్పటికీ ఆయనకు ఈ నెల 24తో 65 ఏళ్లు నిండుతున్నందున పదవీ విరమణ చేయనున్నారు. సీఐసీ పోస్టు కోసం పలువురు విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, అధికార పార్టీ నేతలు, ప్రముఖులు పోటీపడుతున్నారు. సహ చట్టం కింద 9 మంది కమిషనర్లను, సీఐసీని నియమించాలి.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ మొత్తం పోస్టులు ఎప్పుడూ భర్తీచేయలేదు. రాష్ట్రం ఏర్పడ్డాక రెండేళ్లకు సదారాంను సీఐసీగా బుద్దా మురళిని కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆరు నెలల క్రితం మిగతా ఐదుగురిని నియమించింది. ఇప్పుడు సీఐసీతో పాటు మరో 3 కమిషనర్ పోస్టులూ భర్తీ చేయాల్సి ఉంది.