దిశ ఘటనను నిరసిస్తూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. బంగారు తెలంగాణ పేరిట రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. జస్టిస్ ఫర్ దిశ ఘటనలో సీఎం కేసీఆర్ మూడు రోజుల అనంతరం స్పందించడం విచారకరమన్నారు. రాష్ట్ర మంత్రుల వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని... వెంటనే వారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
దోషుల పట్ల ప్రభుత్వం, పోలీసులు అనుసరిస్తున్న వైఖరి వీడాలని భాజపా నాయకురాలు దివ్యరాజ్ హితవు పలికారు. నిందితులను బహిరంగంగా ఉరితీయాలని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు రాధిక డిమాండ్ చేశారు.
జస్టిస్ ఫర్ దిశపై నిజాం కళాశాలలో మానవహారం... నివాళులు
పశువైద్యురాలి ఘటనను ఖండిస్తూ... హైదరాబాద్ బషీర్బాగ్ కూడలిలో నిజాం కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మానవహారం నిర్వహించారు. దిశకు శ్రద్ధాంజలి ఘటిస్తూ... మౌనం పాటించారు. హత్యచారం చేసిన వారిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు.
'అత్యాచారాలను ఖండిస్తూ వీరశైవ లింగాయత్ కొవ్వొత్తుల ర్యాలీ'
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ తెలంగాణ వీరశైవ లింగాయత్ సమాఖ్య హైదరాబాద్ ట్యాంక్ బండ్పై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. అనంతరం ట్యాంక్ బండ్పై ఉన్న బసవేశ్వరుడి విగ్రహం వద్ద జస్టిస్ ఫర్ దిశ చిత్ర పటానికి నివాళులర్పించారు. రోజూ ఎక్కడో ఓ చోట ఇవి జరుగుతున్నాయని... విదేశాల మాదిరిగా కఠినమైన చట్టాలు అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
'మహిళల వరుస హత్యలపై సీఎం స్పందించాలి'
పశు వైద్యురాలు జస్టిస్ ఫర్ దిశ హత్యను ఖండిస్తూ... హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఇందిరా గాంధీ విగ్రహం ముందు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కొవొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, పీసీసీ ప్రధాన కార్యదర్శి విక్రమ్ గౌడ్ హాజరై మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస హత్యలపై సీఎం కేసీఆర్ స్పందించాలన్నారు.
దిశకు మద్దుతుగా వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ
కేంద్రం ప్రత్యేక చట్టాలు తెచ్చి... అత్యాచార నిందితులకు ఉరిశిక్ష విధించాలని కంటోన్మెంట్ సామాజిక కార్యకర్త సతీష్ గుప్తా అన్నారు. పశు వైద్యురాలిని దారుణంగా అత్యచారం, హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దిశ హత్యకు కారణమైన నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
'చికటి పడితే బయటకి రావాలంటేనే గుబులు'
వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం చేసిన వారిని వెంటనే ఉరితీయాలని చంపాపేట్ కృష్ణానగర్ వాసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన నిందితులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చీకటి పడితే ఆడపిల్ల బయటకు రావాలంటేనే జంకుతున్నారని క్రిష్ణా నగర్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
'నాడు నిర్భయ, నేడు దిశ... దేశ వ్యాప్త ఆందోళన'
పశువైద్యురాలు దిశపై హత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆలిండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ కో-ఆర్డినేటర్ రవి కుమార్ అన్నారు. హైదరాబాద్ తార్నాక చౌరస్తాలో జస్టిస్ ఫర్ దిశ పేరిట కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాడు నిర్భయ, నేడు దిశ ఘటనలు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలచివేశాయన్నారు. ఆడపిల్లలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : దిశ నిందితులను కస్టడీకి కోరనున్న పోలీసులు