ఈనెల 23న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 - 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఏపీలోని కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని సూచించింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
కోనసీమ వ్యాప్తంగా వర్షాలు...
ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా ఈరోజు 119.40 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. కోనసీమలోని కొత్తపేట మండలంలో 21.80 మిల్లీ మీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదయింది. అత్యల్పంగా కాట్రేనికోన మండలంలో 2.60 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. కోనసీమ వ్యాప్తంగా భారీ వర్షాల వల్ల జన సంచారానికి వీలులేని వర్షం పడుతోంది. రహదారులు మరింత అధ్వానంగా మారాయి. రహదారుల గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోయి ప్రజలు, వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చూడండి: TS Rains: రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా వర్షం... ఇబ్బందులు పడుతున్న జనం