water release: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్(గండిపేట), హిమాయత్ సాగర్ రిజర్వాయర్లకు వరద నీరు ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జలమండలి సాయంత్రం 6 గంటలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ రెండుగేట్లను ఒక ఫీటు పైకి ఎత్తి నీటిని దిగువన మూసీ నదిలోకి వదిలింది. హిమాయత్‌సాగర్ రెండు గేట్ల ద్వారా 686 క్యూసెక్కులు, ఉస్మాన్ సాగర్ రెండు గేట్ల ద్వారా 208 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు.
ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1785.80 అడుగులు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1760.30 అడుగుల వద్దకు వరదనీరు చేరింది. జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినందున... జలమండలి ఎండీ దాన కిషోర్ సంబంధించిన అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగంతో పాటు జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.