ఏపీలోని విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులను పరామర్శించి, పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట వెళ్లే అవకాశం వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి లభించలేదు. విశాఖపట్నంలో వైకాపా, ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రితో పాటు బయల్దేరేందుకు సిద్ధమైనా... ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, విశాఖ ఇన్‌ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ముఖ్యమంత్రి కార్యదర్శి, వ్యక్తిగత భద్రతాధికారి, వ్యక్తిగత కార్యదర్శి వెళ్తుండటంతో హెలికాప్టర్‌లో చోటులేక ఆగిపోయారు.
గురువారం ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి ముఖ్యమంత్రి బయల్దేరుతున్నప్పుడు ఆయన వాహనంలో విజయసాయిరెడ్డి కూర్చున్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ముఖ్యమంత్రి వద్దకు వచ్చి కాసేపు మాట్లాడాక ఆయన్ను కారెక్కమని జగన్ సూచించారు. దీంతో వెనుక సీట్లో ఉన్న విజయసాయిరెడ్డి కారు దిగి నానికి సీటిచ్చారు. ‘తానిక్కడే ఆగిపోతా’నంటూ ముఖ్యమంత్రికి తెలిపారు.