భారతీయ యువతలో సహజంగానే అపారమైన ప్రతిభా పాటవాలు ఉన్నాయని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆ సామర్థ్యానికి పదునుపెట్టుకొని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని జీఎంఆర్ - వరలక్ష్మి ఫౌండేషన్, జీఎంఆర్ - చిన్మయ విద్యాలయాలను వెంకయ్య సందర్శించారు. ఆ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. అందుబాటులో ఉన్న వనరులు సద్వినియోగం చేసుకోవడం సహా కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవర్చుకోవాలని యువతకు వెంకయ్యనాయుడు సూచించారు. ఇప్పుడు శ్రమించి సొంత కాళ్లపై నిలబడితేనే భవిష్యత్తు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. జీఎంఆర్ - చిన్మయ విద్యాలయ విద్యార్థులతో మాట్లాడుతూ... బాగా చదువుకోవాలని, విద్యతోపాటు శారీరక శ్రమను చిన్నతనం నుంచే అలవర్చుకోవాలన్నారు.

జీఎంఆర్పై ప్రశంసలు..
జీఎంఆర్ సంస్థ చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. జీవితంలో ఎంత సంపాదించినా.. దాన్ని తోటి సమాజంతో పంచుకోవాలనే ఆలోచనే చాలా గొప్పదని కొనియాడారు. చక్కటి ఉదారవాదంతో సేవా కార్యక్రమాలు, యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న జీఎంఆర్ సంస్థ ఛైర్మన్ గ్రంథి మల్లికార్జునరావును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు.
ఇదీచూడండి: cabinet: ప్రగతిభవన్లో మంత్రివర్గం భేటీ... ఆ అంశాలపైనే కీలక చర్చ