వినాయక చవితి వచ్చిందంటే రాష్ట్రంలో ఏ వీధి చూసినా ఆధ్యాత్మిక శోభతో అలరారుతుంది. కేవలం పూజలే కాకుండా ప్రతిమలను ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తూ...... తమ అభిరుచిని చాటుతున్నారు మండపాల నిర్వాహకులు. హైదరాబాద్ పరిధిలో వివిధ ఆకృతులతో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుని విగ్రహాలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. కళాకారులు తమ సృజనాత్మకతకు మెరుగులద్ది సరికొత్తగా ప్రతిమలు రూపొందించారు. హైదరాబాద్‌లో రెండేళ్లుగా కరోనాతో కళ తప్పిన మండపాలు...మళ్లీ పూర్వవైభవం సంతరించుకున్నాయి.
మహారాజ్‌గంజ్, న్యూ ఉస్మాన్‌గంజ్, బేగంబజార్, గన్ ఫౌండ్రి తదితరచోట్ల విభిన్న రూపాల్లో ఏకదంతుడి ప్రతిమలు ఏర్పాటుచేశారు. రావణుడితలపై ఉన్న పార్వతీసుతుడు , విద్యుత్ కాంతులమధ్య తాండవం చేస్తున్న వక్రతుండుడు, సంజీవినిపర్వతం ఎత్తుకున్న గజాననుడు, సింహవాహనంపై మూషికవాహనుడు, శివుని ఆకారంలో ఉమాసుతుడు, కృష్ణుని ఒడిలో కూర్చున్న కరివదనుడు ఇలా వివిధ రకాల్లో కొలువైన అధినాయకుడి ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి.
మండపాలకు విద్యుత్‌దీపాల అలంకరణలు భక్తహృదయాలను కట్టిపడేస్తున్నాయి. ఆయా మండపాల వద్ద సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు రంజింపజేస్తున్నాయి. నిజామాబాద్‌లోనూ భారీ సెట్టింగులతో ప్రతిమలు ఏర్పాటు చేశారు. రాజస్థాన్ భవన్‌లో వినాయక మండపం బయట శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. మండపం మధ్య భాగంలో విఘ్నేషుడు, ఎడమవైపు విష్ణువు, కుడి పక్కన పార్వతీసమేత గణపతిని ప్రతిష్ఠించారు. బాలాజీభవన్‌లో విరాటపర్వం అధ్యాయం వచ్చేలా... ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసేలా ఏర్పాటు చేశారు. రెండో సెట్టింగ్‌లో లక్ష్మీదేవి సిరులు కురుపిస్తున్నట్టుగా.... మూడో సెట్టింగ్‌లో హనుమంతుడు నృత్యం చేస్తున్నట్లుగా రూపొందించిన ప్రతిమలు అలరిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నిఖిల్ చాక్‌పీస్‌పై చెక్కిన వినాయకుడి ప్రతిమ అందరి మదిని దోచుకుంటోంది.
ఇవీ చూడండి