Vande Bharat Express Trains : గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైళ్లకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ రైళ్లలో తమ తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ రైళ్లలోని ప్రపంచస్థాయి వసతులు ప్రయాణికులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ దూరం సులువుగా ప్రయాణించేందుకు వీలుగా ఈ రైళ్లు ఉండటంతో ఇందులో ప్రయాణించేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
Vande Bharat Trains Response Telangana : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నాలుగు వందే భారత్ రైళ్లు డిసెంబరు నెలలో నూరు శాతం కన్నా ఎక్కువ ఆక్యుపెన్సీ నమోదు చేశాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. రైల్వే ప్రయాణికుల అవసరాలు తీర్చడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వందే భారత్ రైళ్లు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయాన్ని అందిస్తున్నాయని చెప్పారు.
తొలిసారి విశాఖ చేరుకున్న ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’.. విశేషాలివే..
Vande Bharat Trains Occupancy in Telangana : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాలుగు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్- విశాఖపట్నం, సికింద్రాబాద్ - తిరుపతి, కాచిగూడ- యశ్వంత్‌పుర్, విజయవాడ- ఎంజీఆర్ చెన్నై మార్గాల్లో ఈ రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. వీటితో పాటు జోన్ పరిధిలోని జాల్నా నుంచి ముంబయికి వందే భారత్ రైలు జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభమైంది.
వందే భారత్ రైలు.. ప్రత్యేకతలేంటో ఓసారి చూడండి
Vande Bharat Trains Running Capacity : వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు అనుకూలమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణంగా ప్రసిద్ధి చెందింది. ఈ రైలు ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లలో పూర్తి సిట్టింగ్ ఏసీ సదుపాయాలతో ప్రయాణాన్ని అందిస్తున్నాయి.
దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ రైలులో జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, రిక్లైనింగ్ సీట్లు, అన్ని కోచ్‌లలో సీసీ టివీ కెమెరాలు, డిఫ్యూజ్డ్ ఎల్ఈడీ లైటింగ్, ప్రతి సీటు కింద ఛార్జింగ్ పాయింట్లు వంటి అనేక ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉన్నాయి. మెరుగైన ప్రయాణ సౌకర్యం, మరింత భద్రతను అందిస్తుండటంతో సహజంగా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.
వందే భారత్ రైళ్ల ఆక్యుపెన్సీ వివరాలు
- సికింద్రాబాద్ - విశాఖపట్నం రైలు 16 కోచ్‌లు. వందశాతం ఆక్యుపెన్సీతో స్థిరంగా నడుస్తోంది. తిరుగు మార్గంలో దీని ఆక్యుపెన్సీ 143 శాతంగా ఉంది
- సికింద్రాబాద్- తిరుపతి రైలు ఎనిమిది కోచ్‌లతో ప్రారంభమై ప్రస్తుతం 16 కోచ్‌లతో నడుస్తోంది. డిసెంబర్ లో 114 శాతం నమోదు కాగా, 105 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
- కాచిగూడ - యశ్వంత్‌పుర్ మధ్య ఎనిమిది కోచ్‌లతో కూడిన ఈ వందేభారత్ రైలుకు మంచి ఆదరణ వస్తోంది. ఇది 107 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. తిరుగు ప్రయాణంలో 110 శాతం ఆక్యుపెన్సీ ఉంది.
- విజయవాడ - ఎంజీఆర్‌చెన్నై రైలు తిరుపతిని కలుపుతూ వెళ్లడంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. దీని ఆక్యుపెన్సీ 126 శాతం ఉండగా తిరుగు ప్రయాణంలో 119 శాతంగా ఉందని రైల్వే శాఖ తెలిపింది.