పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలని విద్యా కమిషనర్‌ను జాక్టో-యూయస్పీసీ కోరింది. పాఠశాలలకు ప్రతిరోజూ 50శాతం ఉపాధ్యాయులు హాజరవుతున్నా గదులు ఊడ్చేవారు, మూత్రశాలలు శుభ్రం చేసేవారు లేక ఉపాధ్యాయులే శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పాఠశాలలకు విద్యార్థులు హాజరయ్యేంత వరకు ప్రతి పాఠశాలకు కనీసం ఒక స్వచ్ఛ కార్మికుడినైనా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జాక్టో, యూయస్పీసీ నాయకులు జి. సదానందంగౌడ్, కె. జంగయ్య, చావరవి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డితో కలిసి డైరెక్టర్ శ్రీదేవసేనతో వివిధ సమస్యలపై చర్చించి వినతిపత్రం అందజేశారు.
అంతర్ జిల్లాల బదిలీల్లో ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యాయులకు కూడా అవకాశం ఇవ్వాలన్నారు. అప్‌గ్రేడెడ్ పండిట్, పీఈటీ పోస్టులతో సహా ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. యాజమాన్యం వారీ, పాత పది జిల్లాలు యూనిట్‌గా వెంటనే పదోన్నతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. డీయస్ఈ శ్రీదేవసేన సానుకూలంగా స్పందిస్తూ తన కార్యాలయం పరిధిలోని సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని, మిగిలిన అంశాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి సానుకూల ఉత్తర్వుల కోసం ప్రయత్నం చేస్తామన్నారు.
ఇదీ చూడండి: చిన్నారుల స్థాయిని పెంచిన రచయిత 'హకీం జానీ'