గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలోని దాదాపు 20 కాలనీల ప్రతినిధులు కేటీఆర్‌ను కలిశారు. చాలా రోజులుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలు తొలగించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పలు కారణాలతో యాజమాన్య హక్కులు లేకుండా ఇబ్బందులు పడుతున్న ప్రజలందరి సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి చెప్పారు.
పేదవాడికి స్థిరాస్తిపై యాజమాన్య హక్కు కల్పించడమే లక్ష్యంగా బస్తీలు, కాలనీలో ఉన్న రెవెన్యూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నిస్తామని అన్నారు. కేసీఆర్ నగర్ లాంటి కాలనీలను డీనోటిఫై చేయడం ద్వారా ఆయా కాలనీల్లోని ప్రజలకు ఉపయుక్తంగా మారిందని... ఇతర కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు పురపాలకశాఖ సిద్ధంగా ఉందని అన్నారు.
ధరణితో ప్రయోజనం
ధరణి ద్వారా నగరంలో ఉన్న ప్రతి ఇంచు భూమికి సంబంధించిన వివరాలకు అనుగుణంగా యాజమాన్య హక్కులను పొందే వీలు కలుగుతుందని కేటీఆర్ చెప్పారు. ధరణి ద్వారా భూయాజమాన్య హక్కుల విషయంలో అవకతవకలు జరగకుండా భవిష్యత్తులో కార్యకలాపాలు నిర్వహించే వీలు కలుగుతుందని... అవినీతిరహితంగా, వేగంగా, పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉందని అన్నారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నా ఎక్కువగా ఇంకెవరికీ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఉంటుందని మంత్రి ప్రశ్నించారు.
కేసీఆర్‌తోనే సాధ్యం
తెలంగాణ, హైదరాబాద్ సమగ్రాభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. పేదవాడికి భూయాజమాన్య హక్కులు అందించేందుకు ఎలాంటి అదనపు భారాన్ని మోపాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్న ఆయన... ప్రజలకు ఊరట కల్పించాలన్న లక్ష్యంతో తప్ప మరో ఆలోచన లేదని అన్నారు. ఎల్బీనగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి వంటి నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోందన్న కేటీఆర్... రెవెన్యూ సమస్యల పరిష్కారంతో ఆగిపోకుండా ప్రజలకు అవసరమైన మౌలికవసతుల కల్పనపై కూడా దృష్టి సారిస్తామని చెప్పారు.
అర్హులకే ఇళ్లు
పేద, మధ్యతరగతి వర్గాలకు అండగా నిలబడాలన్న ఆలోచనతోనే సర్కార్ ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో ఇల్లు, ఇంటి స్థలాలు లేని వారి కోసం నిర్మిస్తున్న లక్ష రెండుపడకల గదుల ఇళ్లను ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకత విధానంలో అర్హులైన వారికి అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లు దక్కేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.