UPSC Civils Final Results 2022 Toppers : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్స్ పరీక్షల్లో తెలుగు అభ్యర్థులు తమ సత్తా చాటారు. 2022 సంవత్సరంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది మొత్తం 933 మంది అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యారు. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు కూడా తమ సత్తాచాటారు.
సత్తా చాటిన తెలుగు విద్యార్థులు: తెలంగాణ, ఏపీ నుంచి సుమారు 40 మంది ర్యాంకులు దక్కించుకున్నారు. వందలోపు ర్యాంకులు 8 మంది కైవసం చేసుకున్నారు. నారాయణ పేట ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె ఉమా హారతి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి.. తెలుగు రాష్ట్రాల్లో టాపర్‌గా నిలిచారు. తిరుపతికి చెందిన జీవీఎస్ పవన్ దత్తా 22వ ర్యాంకు కైవసం చేసుకున్నారు.
రాజమండ్రికి చెందిన తరుణ్ పట్నాయక్ మాదాలకు 33, హైదరాబాద్‌కు చెందిన అజ్మీరా సంకేత్ కుమార్ 35, వరంగల్ జిల్లాకు చెందిన శ్రీసాయి ఆశ్రిత్ శాఖమూరికి 40వ ర్యాంకు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్ సాయి ప్రణవ్ 60, ఉత్కర్ష్ కుమార్ 78, ఆవుల సాయికృష్ణ 94వ ర్యాంకు సాధించారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అభ్యర్థులు తమ ప్రతిభతో మెరిశారు. ఏపీ, తెలంగాణ నుంచి నిధి పాయ్, అంకుర్ కుమార్, శ్రీకృష్ణ, హర్షిత, లక్ష్మీ సుజిత, కమల్ చౌదరి, రేవయ్య, శ్రవణ్ కుమార్ రెడ్డి, రెడ్డి భార్గవ్, నాగుల కృపాకర్ సివిల్స్‌కు ఎంపికయ్యారు.
ఈ ఏడాది కూడా ఎక్కువగా ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు విజయకేతనం ఎగరవేశారు. ఇప్పటికే విజయం సాధించి ఐపీఎస్, ఐఆర్ఎస్ శిక్షణలో ఉన్న అభ్యర్థులు.. మరో ప్రయత్నం చేసి మెరుగైన ర్యాంకులు సాధించారు. గత ప్రయత్నాల్లో విఫలమైనప్పటికీ.. పట్టుదలతో విజయం సాధించారు. ఈ ఏడాది ర్యాంకులు సాధించిన వారు మరింత మెరుగైన ర్యాంకు కోసం మరో ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు.
UPSC Civils Final Results 2022 : సివిల్స్- 2022 తుది ఫలితాలు.. మంగళవారం విడుదలయ్యాయి. మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 38, ఐపీఎస్‌కు 200 మంది చొప్పున ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఏ కేటగిరీలో 473 మంది, గ్రూప్ బీ సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఫలితాల ప్రకటన తేదీ నుంచి 15 రోజుల్లోగా వెబ్‌సైట్‌లో మార్కులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ఇవీ చదవండి: