One Week One Lab in Hyderabad: వెదురు పరిశ్రమను సద్వినియోగం చేసుకోవాలని కేంద్రమంత్రి జితేందర్ సింగ్ అన్నారు. గతంలో వెదురు కోసం చైనా, కొరియా, జపాన్ల మీద ఆధారపడేవాళ్లమని... ఇప్పుడు ఆయా దేశాలు పన్ను పెంచడంతో వెదురు పరిశ్రమను అభివృద్ది చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ వెదురును ఉపయోగించే అగరవత్తులు తయారు చేస్తున్నామని తెలిపారు. తార్నాక సీఎస్‌ఐఆర్, ఐఐసీటీ ఆడిటోరియంలో నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహించనున్న 'వన్ వీక్ వన్ ల్యాబ్' కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు.
శాస్త్రవేత్తలు కొంత రిస్క్ తీసుకోవాలి : ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి జితేందర్ సింగ్.. ప్రధాని నరేంద్రమోదీ దార్శనికత వల్లే నేడు వెదురు పరిశ్రమ వృద్ధి చెందిందన్నారు. భారత్ అన్ని రంగాల్లో పురోగమిస్తుందన్న జితేందర్ సింగ్.. మన ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉందని వివరించారు. అనంతరం భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్ల మాట్లాడుతూ.. సమాజ అవసరాల కోసం శాస్త్రవేత్తలు సాహసోపేత ప్రయోగాలు చేయాలని అన్నారు. వ్యక్తిగత ప్రాజెక్టులే కాకుండా సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. మరిన్ని కొత్త ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం ఉందని వివరించారు. ఆవిష్కరణల్లో దేశం ముందుకెళ్లడానికి శాస్త్రవేత్తలు కొంత రిస్క్ తీసుకోవాలని కృష్ణ ఎల్ల పేర్కొన్నారు.
'ఆవిష్కరణలో ఎలా ముందుకెళ్లాలన్నది చాలా ముఖ్యం. అది ఒక సవాల్. మన శాస్త్రవేత్తలతో సమస్య ఏంటంటే మనకు ఉత్సాహం ఉంటుంది కానీ భయం కూడా ఉంటుంది. అది విఫలమవుతుందోననే భయంతో సాహసం చేయడానికి భయపడతాం. ఆ భయం నుంచి మనం బయటకు రావాలని నేను ఆశిస్తున్నాను. ఆవిష్కరణల్లో దేశం ముందుకెళ్లడానికి శాస్త్రవేత్తలు కొంత రిస్క్ తీసుకోవాలి. నేను మా శాస్త్రవేత్తలకు రెండు ప్రాజెక్టులు చేయమని చెబుతాను. ఒకటి మీకు నచ్చింది చేయండి. కానీ మరొకటి సమాజం ఏం కోరుకుంటుందో అది చేయండి. దేశం, సమాజం గురించి ఆలోచించి దేశాన్ని ఆవిష్కరణల దేశంగా మనం ముందుకు తీసుకెళ్లవచ్చు.'-కృష్ణ ఎల్ల, భారత్ బయోటెక్ ఎండీ
ఈ 'వన్ వీక్ వన్ ల్యాబ్' కార్యక్రమంలో కేంద్రమంత్రి జితేందర్సింగ్తో పాటు భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, ప్రదీప్ దావే, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: