గ్రేటర్ హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలు ఆగడంలేదు. గతేడాది అక్టోబర్‌లో వచ్చిన వరదల కారణంగా నగర శివారుల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు తీవ్ర ప్రభావితమయ్యాయి. శివారు ప్రాంతాల్లో నీరు వెళ్లే దారిలేక రోజుల తరబడి కాలనీలు, బస్తీలు ముంపులో ఉండిపోయాయి. అదే సమయంలో మంత్రి కేటీఆర్.. మున్సిపల్ అధికారులతో సమీక్షించారు.
ప్రత్యేక ఉత్తర్వులు...
నాలాలు, చెరువులు వంటివి ఆక్రమణలకు గురికావడం వల్ల సమస్య ఏర్పడినట్లు కమిషనర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా నవంబరు 2న మున్సిపల్ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. చెరువు శిఖం భూములు, నాలాలు, ఎఫ్‌టీఎల్‌లో ఉన్న నిర్మాణాలు తొలగించాలని పేర్కొంది. అక్రమ కట్టడాలు తొలగించాలని నగర శివారులోని బడంగ్పేట్, మీర్‌పేట, జవహార్‌నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్లకు, దుండిగల్, దమ్మాయి గూడ, ఘట్కేసర్, జల్‌పల్లి, కొంపల్లి, నాగారం, పెద్ద అంబర్పేట్, పోచారం, తుర్కయాంజల్ మున్సిపాలిటీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అధికారుల నిర్లక్ష్యం...
ఉత్తర్వులు వచ్చి మూడు నెలలైనా... అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీలో మాసబ్‌చెరువు నిండిన తర్వాత జిలాన్‌ఖాన్ చెరువులోకి నీరు పారుతోంది. ఇక్కడ కాలువను ఆక్రమించి 25 నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించినా కూల్చలేదు. అధికారుల ఆదేశాలతో దుండిగల్ మున్సిపాలిటీలో రెండు, మూడు కట్టడాలు కూల్చివేసి తర్వాత వదిలేశారు.
తూతూ మంత్రంగా...
శంషాబాద్ మున్సిపాలిటీ మధురానగర్‌లో నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అధికారులు తూతూమంత్రంగా నాలాలో పూడిక తీసినట్లు తీసి వదిలేశారు. ఆయా మున్సిపాలిటీల్లో పట్టణ ప్రణాళిక విభాగం ఖాళీగా ఉంది. అన్నిచోట్ల పట్టణ ప్రణాళిక విభాగం ఇంఛార్జిలు ఉన్నారు. ఒక్కొక్క పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు రెండు, మూడు చోట్ల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించడంలో వీరు ముందుకు వెళ్లడంలేదు.
అక్రమ నిర్మాణాలు...
జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంలోని అధికారులే శివారు మున్సిపాలిటీల బాధ్యతలూ చూస్తున్నారు. జల్‌పల్లి మున్సిపాలిటీ బురాన్‌ఖాన్ చెరువులో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఫిరంగి నాలాను ఆక్రమించి భారీగా భవనాలు నిర్మిస్తున్నారు. పోచారం మున్సిపాలిటీలోని ఎర్రమల్లె వాగులో నిర్మాణాలు వెలిశాయి. నాయకులు వెంచర్లు చేసి ప్లాట్లు అమ్ముకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కొరవడిన సమన్వయం...
యాంనంపేటలో బొంతకుంట వాగును స్థిరాస్తి వ్యాపారులు మట్టితో నింపి చదును చేశారు. నాగారంలోని అన్నరాయుని చెరువు అలుగు పారే నాలా చర్లపల్లిలో కలుస్తుండగా... పూర్తిగా ఆక్రమణలకు గురైంది. నాలాలు, చెరువులను సర్వే చేసి హద్దులు గుర్తించే బాధ్యత రెవెన్యూ శాఖదని.. పరిరక్షణ బాధ్యత నీటి పారుదలశాఖదని చేతులు దులుపుకొంటున్నారు. మూడు శాఖలు ఐక్యంగా పనిచేయాల్సి ఉన్నా సమన్వయం కొరవడుతోంది.
ఇదీ చూడండి: సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడే... కానీ అదొక్కటే నెగిటివ్: జీవన్‌రెడ్డి