ఆదిలాబాద్ భుక్తాపూర్ టౌన్‌ఫీడర్-1 పరిధిలో సాంకేతిక సమస్య ఉంది. దీన్ని సరిచేయడానికి ఈనెల 10న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరా ఉండదు. వినియోగదారులు సహకరించాలి. ఈనెల 9న విద్యుత్ శాఖాధికారులు జారీ చేసిన ప్రకటన ఇది. వాస్తవానికి ఆరోజు సబ్‌స్టేషన్‌లో ఎలాంటి సాంకేతిక సమస్య ఉత్పన్నం కాలేదు. కానీ సరఫరాను నిలిపివేశారు. ఈనెల 11న మళ్లీ సమస్య ఉందంటూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపివేశారు. అప్పుడు ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తలేదు. మళ్లీ ఈనెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలరకు సాంకేతిక సమస్య పేరిట సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి సాయంత్రం 3.46 గంటల వరకు పునరుద్ధరించలేదు.
అంతరాయం…
ఏంటా? అని ఈటీవీ భారత్ ఆరాతీస్తే పట్టణ పరిధిలో ఓ సివిల్ కాంట్రాక్టర్ చేసుకునే పనులకు అనుగుణంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడైంది. ఓ పక్క కొవిడ్ లాక్‌డౌన్, మరోపక్క వేసవి ఉక్కపోత వెరసి జనాలను ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనికి తోడూ వేళాపాళా లేకుండా నిలిచిపోతున్న విద్యుత్ సరఫరా ప్రజలను మరింత చికాకుకు గురిచేస్తోంది. నిజంగానే మరమ్మతులు ఉంటే ఏమో అనుకోవచ్చు. కానీ గుత్తేదారులకు అనుగుణంగా సరఫరాను స్తంభింపచేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఈనెల 6 నుంచి మొదలుకొని ఈనెల 25 (మంగళవారం) వరకు ఇరవై రోజుల వ్యవధిలో 10 రోజులు సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
పైగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అని ప్రకటించడం సాయంత్రం వరకు పునరుద్ధరించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈనెల 6న కైలాస్‌నగర్ పరిధిలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరాను నిలిపివేశారు. దాదాపుగా పగలంతా జనం విలవిలాడినా అధికారులెవరూ స్పందించలేదు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,89,851 గృహ వినియోగ మీటర్లుంటే 19,284 వాణిజ్యపరమైన మీటర్లు ఉన్నాయి. లాక్‌డౌన్‌తో వాణిజ్య పరిశ్రమల విద్యుత్ వినియోగం తగ్గినప్పటికీ గృహ వినియోగానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. కానీ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా తరచూ అంతరాయం ఏర్పడుతుండటంతో ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తోంది.
మరోపక్క గ్రామీణ ప్రాంతాల్లో అప్రకటిత విద్యుత్ కోత అమలవుతోంది. భీంపూర్, ఆదిలాబాద్ గ్రామీణం, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, నార్నూర్, బేలలాంటి మారుమూల ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోవడంతో కొన్నిసార్లు సెల్‌ఫోన్ టవర్లు పనిచేయని స్థితికి చేరుకుంటోంది.
అమలవుతున్న విధానమిది…
ఆదిలాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 49 వార్డుల్లో మొత్తం 43,442 గృహ వినియోగ మీటర్లు ఉంటే ఆదిలాబాద్ ఉత్తర, దక్షిణ, టౌన్-3 ఇంజినీరింగ్ విభాగాలుగా విద్యుత్‌శాఖ పర్యవేక్షణ చేస్తోంది. ఇటీవల పట్టణ సుందరీకరణ భాగంగా గాంధీ, అంబేద్కర్, శివాజీ, వివేకానంద, నేతాజీ, పంజాబ్ చౌరస్తాలతో పాటు పాత జాతీయ రహాదారి రహాదారి వెడల్పు కార్యక్రమం కొనసాగుతోంది. పనులు జరిగే చోట అవసరాలరీత్యా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మార్లకు అనుగుణంగా సరఫరా నిలిపివేసి పనులను సహకరించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది గుత్తేదారులకు తనకు ఇష్టమైన చోట పనులను నిర్వహించుకోవడం కోసం ఏకంగా సబ్‌స్టేషన్ల పరిధిలో మొత్తం సరఫరా నిలిపివేయాలని చేస్తున్న సిఫారసుకు అనుగుణంగా విద్యుత్ శాఖాధికారుల ఉపసహరించడంతోనే సమస్య ఉత్పన్నమవుతోంది. ఒకరిద్దరు గుత్తేదారులు, కొంతమంది విద్యుత్ శాఖాధికారుల మధ్య సఖ్యత ఉండటంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు వెల్లడవుతోంది.
సమస్య లేకుండా చూస్తాం…
ఇదే విషయమై ఈటీవీ భారత్ తొలుత పట్టణ ఏడీ మక్దూం అలీని చరవాణిలో సంప్రదించగా రోడ్ల వెడల్పు పనులకు అంతరాయం కలగకుండా సరఫరా నిలిపివేసినట్లు ప్రకటించారు. అవసరంలేని ప్రాంతాలకు ఎందుకు నిలిపివేస్తున్నారని ప్రశ్నిస్తే తన దృష్టికి రాలేదని పేర్కొన్నారు. కాగా ఎస్‌ఈ చవాన్ సంప్రదించగా ప్రజలకు ఇక నుంచి ఎలాంటి సమస్య తలెత్తకుండా చూస్తానని పేర్కొనడం విశేషం.