Brahmotsavams of Sri Padmavati Ammavaru: ఆంధ్రప్రదేశ్లో ఆపద మొక్కుల వాడు శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల తరహాలోనే పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు.. తొమ్మిదో రోజున నిర్వహించే పంచమతీర్థంతో ముగుస్తాయి. రోజూ ఉదయం, సాయంత్రం రెండు వాహన సేవలు నిర్వహిస్తారు. గజవాహనం, గరుడ వాహనం, రథోత్సవంలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తారు.
బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే పంచమతీర్థం కార్యక్రమానికి తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తారు. పంచమతీర్థానికి తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు ఉన్న ప్రాధాన్యత అమ్మవారి ఉత్సవాల్లో పంచమతీర్థానికి ఉంది. బ్రహ్మోత్సవాల ప్రారంభం నేపథ్యంలో తొలిరోజు అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరిగింది.
బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచోసుకోకుండా తితిదే అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల వేళ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రానుండటంతో అమ్మవారి దర్శనం, ప్రసాదాలు, అన్నదానం సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తితిదే చర్యలు తీసుకుందని ఆలయ అర్చకులు తెలిపారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలోనే శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలనూ తితిదే వైభవంగా నిర్వహించనుంది. వాహన సేవల్లో వివిధ రకాల అలంకరణలో అలమేలుమంగ భక్తులకు సాక్ష్యాత్కరించనున్నారు. ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా కోర్కెలు తీరడంతో పాటు జన్మధన్యమవుతుందని భక్తులు విశ్వసిస్తారు.
ఇవీ చదవండి: