TSRTC Gets Huge Income of Dussehra Festival 2023 : టీఎస్ఆర్టీసీ దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారికోసం ప్రత్యేక బస్సుల(TSRTC Dussehra Special Buses)ను ఏర్పాటు చేసింది. తెలంగాణతో పాటు ఆంధ్రపదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. గత ఏడాది ఆర్టీసీ 4,198 ప్రత్యేక బస్సులను నడిపించగా.. ఈ ఏడాది 5,500 బస్సులను ఆర్టీసీ నడిపించింది. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం అదనంగా మరో 1,302 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన బస్స్టేషన్లు అయిన ఎంజీబీఎస్, జేబీఎస్‌లతో పాటు.. సీబీఎస్, దిల్సుఖ్నగర్, లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ, ఎస్ఆర్.నగర్, అమీర్‌పేట్, టెలిఫోన్ భవన్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీనగర్ల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. ఈసారి కూడా ఆర్టీసీ సాధారణ ఛార్జీలనే వసూలు చేసింది.
లాభాలు తీసుకొచ్చిన డైనమిక్ ఛార్జీలు : టీఎస్ఆర్టీసీ ఈసారి డైనమిక్ ఛార్జీల(TSRTC Dynamic Charges)ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలోనే డైనమిక్ ఛార్జీలు వసూలు చేసినప్పటికీ దసరా పండగ సందర్భంగా ఇవి ఆర్టీసీకి కలిసి వచ్చాయి. ప్రయాణికులు తక్కువ సమయంలో తక్కువ ఛార్జీలు, రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో ఎక్కువ వసూలు చేయడమే డైనమిక్ ఫేర్ ఉద్దేశ్యం. ఇది ఆర్టీసీకి బాగా కలిసి వచ్చింది. బెంగళూరు, విశాఖపట్టణం, విజయవాడ, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లే వారు డైనమిక్ ఫేర్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. బయటి ప్రైవేటు ట్రావెల్స్తో పోల్చితే డైనమిక్ ఛార్జీలు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేందుకు ఎక్కువగా మొగ్గు చూపినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సాధారణ చార్జీలతోనే స్పెషల్ బస్సులు
TSRTC Income For Dussehra Festival : ఈసారి దసరా పండగ సందర్భంగా ఆర్టీసీ అక్టోబరు 13 నుంచి 24వ తేదీ వరకు 11 రోజుల పాటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపించింది. తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి.. మరింత ఆదాయాన్ని పెంచుకుంది. ప్రతిరోజు ఆర్టీసీకి సుమారు రూ.12 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. దసరా పండగ సందర్భంగా ప్రతిరోజు అదనంగా సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. అత్యధికంగా రూ.19 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈవిధంగా ఆర్టీసీకి గత 11 రోజుల్లో రూ.25 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 10 రీజియన్లు ఉన్నాయి. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్, గ్రేటర్ హైదరాబాద్ రీజియన్(ఇందులో రెండు రీజియన్లు).. వీటిలో ఒక్కొక్క రీజియన్‌కు సరాసరిగా రూ.2కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.