Mareddy Fire On BJP: ధాన్యం విషయంలో తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. వానాకాలంలో అదనంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకోవడానికి కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వడంపై స్పందించారు. పంజాబ్, హరియాణాకు ఒక విధానం, తెలంగాణకు మరో విధానం అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు. పంజాబ్‌లో 1.85 కోట్ల మెట్రిక్ టన్నులు, హరియాణాలో 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకున్న కేంద్రం తెలంగాణకు వచ్చే వరకు 2 లక్షలు, 6 లక్షలు అంటూ బేరాలు ఆడుతోందని దుయ్యబట్టారు. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని గానీ... లేదా రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్లుగా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకుంటామని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.
భాజపా నాటకాలాడుతోంది...
Tscscl Chairman Fire On BJP: పంజాబ్ రాష్ట్రం నుంచి కర్ణాటకకు ఎఫ్‌సీఐ బియ్యం సరఫరా చేస్తున్న కేంద్రం... పక్కనే ఉన్న తెలంగాణ నుంచి ఎందుకు సరఫరా చేయడం లేదని ప్రశ్నిస్తూ మారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంత ఆర్థిక భారమైనా లెక్కచేయకుండా రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పౌరసరఫరాల సంస్థ 2014-15 నుండి ఈ రోజు వరకు దాదాపు రూ. 96 వేల కోట్లు వెచ్చించి 6 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు. కేవలం 7 ఏళ్లల్లో ఇంత పెద్దఎత్తున ధాన్యం కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. దేశంలో పంజాబ్ తర్వాత రెండో స్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా రైతు సమస్యలు పరిష్కరించకుండా రాజకీయ నాటకాలాడుతోందని విమర్శించారు.
రేవంత్ రెడ్డివి చిల్లర రాజకీయాలు..
Mareddy Srinivas Reddy fire on Congress: రాష్ట్రంలో దిక్కుముక్కు లేని కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉనికి కోసం పాకులాడుతుందని ఆరోపించారు ఆక్షేపించారు. రైతులు యాసంగిలో వడ్లు పండించాలని.. ప్రభుత్వం మెడలు వంచైనా కొనుగోలు చేయిస్తామని రైతులను రెచ్చగొట్టే విధంగా టీపీసీసీ అధ్యక్షుడు మాట్లాడడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ పెద్దల మెప్పు కోసం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టబోమని పునరుద్ఘాటించారు. సీఎం మాటలను వక్రీకరించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. సీఎం గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని తెలిపారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఆయకే తెలియదని మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు.
ఇదీ చదవండి: Good news for drinkers: మద్యం ప్రియులకు శుభవార్త.. అర్ధరాత్రి వరకు అమ్మకాలు