భవననిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతులు సరళంగా, నిర్ధేశిత గడువులోగా వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ బీ-పాస్ చట్టాన్ని తీసుకొచ్చింది. కార్యాలయాల చుట్టూ తిరగకుండా స్వీయ ధ్రువీకరణ ద్వారా నిర్దేశించిన గడువులోగా అనుమతులు పొందడమే దీని ప్రధాన ఉద్దేశం. పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే అనమతులు పొందేలా గత కొన్నాళ్లుగా విస్తృత కసరత్తు చేశారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ సిద్ధమైంది. పూర్తి స్థాయిలో ప్రారంభంకానప్పటికీ టీస్ బీ-పాస్ పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.
టీస్ బీ-పాస్‌కు సంబంధించిన సమాచారంతోపాటు ఫ్లోచార్ట్, చెక్ లిస్ట్, టైంలైన్స్‌తోపాటు చట్టాలు, ఉత్తర్వులు, శాఖలు, యూజర్ మాన్యువల్‌లను పోర్టల్‌లో పొందుపరిచారు. పోర్టల్ ద్వారానే భవన నిర్మాణం కోసం అనుమతులు, లేఅవుట్ల అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, భూవినియోగ ధ్రువపత్రం, భూమార్పిడి సహా పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం నిరభ్యంతర పత్రాల కోసం దరఖాస్తు చేయవచ్చు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా అనుమతుల్లేని, ఆక్రమణలు, ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదులు చేయవచ్చు.
భవన నిర్మాణ అనుమతుల్లో 75 గజాల వరకు తక్షణ రిజిస్ట్రేషన్, 75 గజాలపై నుంచి 500 చదరపు మీటర్ల వరకు తక్షణ అనుమతులు సహా ఆపై ఉన్న వాటి అనుమతుల కోసం విడిగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అనుమతులు, ధ్రువపత్రాలు జారీ చేసే ఆయా శాఖలు, నిర్ధేశిత గడువును సైతం పోర్టల్‌లో పొందుపరిచారు. కేవలం స్వీయ ధ్రువీకరణ ద్వారానే ఆన్‌లైన్‌లో అనుమతులు, ధ్రువపత్రాలు జారీ చేస్తారు. నిర్ధేశిత గడువులోగా అనుమతులు మంజూరు చేయకపోతే గడువు పూర్తయ్యాక అనుమతులు వచ్చినట్లుగానే భావించి తదుపరి నిర్మాణాలు చేపట్టే అవకాశాన్ని కొత్త విధానం కల్పిస్తోంది.
అనుమతులు ఇచ్చిన అనంతరం జిల్లా కలెక్టర్ లేదా జీహెచ్ఎంసీ కమిషనర్ నియమించిన కమిటీలు క్షేత్రస్థాయి పరిశీలనతోపాటు దరఖాస్తుదారు స్వీయ ధ్రువీకరణ సమాచారాన్ని పరిశీలిస్తాయి. తప్పుడు సమాచారం ఇచ్చినా, వాస్తవాలను దాచిపెట్టినా దరఖాస్తుదారునిపై ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు. అనుమతుల ఉల్లంఘనకు పాల్పడితే ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే భవనాలు కూల్చివేసే అధికారం చట్టం ద్వారా కల్పించారు. పోర్టల్ ఇప్పటికే ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చింది. ఒకటి, రెండు రోజుల్లో టీఎస్ బీ-పాస్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తయ్యాక టీఎస్ బీ-పాస్ ద్వారా తక్షణ అనుమతుల ప్రక్రియ సులభమవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: నేడు కంప్యాక్టర్ వాహనాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్