రేపు తెలంగాణ భవన్‌లో తెరాస రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు కమిటీ భేటీ కానుంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై రాష్ట్ర కమిటీ కమిటీ చర్చించనుంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర శాఖల పునర్నిర్మాణంపైనా చర్చిస్తారు. పునర్నిర్మాణం తేదీల ఖరారు, తదితర అంశాలు కమిటీ చర్చిస్తుందని తెరాస వర్గాలు వెల్లడించాయి. దళితబంధు అమలులో అనుసరించాల్సిన విధానంపైనా కమిటీ దృష్టిసారించనుందని నేతలు తెలిపారు.
హుజూరాబాద్ ఉపఎన్నికపై మంత్రులు, నేతలతో సీఎం కేసీఆర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సహా ఇతర నేతలతో ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పరిస్థితులపై చర్చించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించాక పరిస్థితులు, దళితబంధు పథకం ప్రారంభ సభ తర్వాత ప్రజల్లో స్పందన తదితర అంశాలపై మంత్రులు, నేతలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో మంచి స్పందన ఉందని, పార్టీకి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని నేతలతో సీఎం అన్నట్లు సమాచారం. ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని... ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల వల్ల లబ్ధి తదితరాలను వివరించాలని సూచించినట్లు తెలిసింది. ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి గెలుపు ఆవశ్యకతను ప్రజలకు బాగా వివరించాలని నేతలకు సీఎం చెప్పినట్లు సమాచారం.
ఇదీ చూడండి: హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ.500 కోట్ల నిధులు