రాష్ట్ర రాజకీయాల్లో తెరాస మరోసారి ఆధిక్యతను చాటుకుంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ సత్తా చాటిన గులాబీ పార్టీ.. పురపోరులో మరోసారి తన శక్తిని ప్రదర్శించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన తెరాస.. పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లో సత్తా చాటింది. పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ.. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని విపక్షాలపై పైచేయిని సాధించింది. కార్పొరేషన్, పురపాలక ఎన్నికల్లోనూ గెలుపును పునరావృతం చేసింది.
ఆరు నెలల ముందు నుంచే
కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే సిద్ధమైంది గులాబీ పార్టీ. పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన వెంటనే.. పురపోరుపై కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. తెరాస ప్రధాన కార్యదర్శులతో రెండు సార్లు సమావేశయ్యారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి ఓ కమిటీ ఏర్పాటు చేశారు. న్యాయస్థానంలో ఎన్నికల వ్యవహారం కొలిక్కి రావడం వల్ల మళ్లీ వేగం పెంచారు. షెడ్యూలు ప్రకటించగానే చకచకా వ్యూహాలను అమలు చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, పార్టీ యంత్రాంగంతో పాటు.. ప్రైవేట్ వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సర్వేలు చేయించారు.
స్థానిక అంశాలకే ప్రాధాన్యం
స్థానిక అంశాలకే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చేలా వ్యూహాలు రూపొందించింది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ఎమ్మెల్యేలకే బాధ్యత అప్పగించింది. కొన్ని చోట్ల సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. వెనక్కి తగ్గలేదు. సుమారు 20 నేతల మధ్య విబేధాలు కనిపించడం వల్ల కేటీఆర్ రంగంలోకి దిగి సర్దుబాట్లు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. దాదాపు అన్ని చోట్లా తెరాస రెబల్స్ బరిలో నిలిచారు. పలు వార్డుల్లో తిరుగుబాటు అభ్యర్థుల చేతిలో తెరాస ఓటమి పాలయింది.
ఆర్థికంగా బలమున్న అభ్యర్థులు
ప్రచారంలోనూ స్థానిక సమస్యలనే ఎక్కువగా ప్రస్తావించాలని అభ్యర్థులకు తెరాస నాయకత్వం సూచించింది. మరోవైపు కేసీఆర్, కేటీఆర్ నాయకత్వ సమర్థత, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. స్థిరాస్తి ప్రభావం ఎక్కువగా ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆర్థికంగా బలమున్న అభ్యర్థులను నిలబెట్టేందుకే ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు.
ప్రచారానికి దూరంగా కేసీఆర్
మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ పూర్తిగా దూరంగా ఉన్నారు. తెలంగాణ భవన్లో రెండు సార్లు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ అయ్యారు. గజ్వేల్ నియోజకవర్గంలోనూ కేసీఆర్ ప్రచారం చేయలేదు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా తన సొంత నియోజకవర్గం సిరిసిల్లతో పాటు.. వేములవాడకు మాత్రమే పరిమితమయ్యారు. ఉమ్మడి జిల్లాల వారీగా నిరంతరం సమీక్షించేందుకు తొమ్మిది మంది సీనియర్ నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. కేటీఆర్ దావోస్ వెళ్లినప్పటికీ.. ఫోన్లో నిరంతరం పర్యవేక్షించారు.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్కు ఓటరు అవగాహన అవార్డు!