MLC Kavitha Letter To CBI : మద్యం కుంభకోణం కేసు విచారణ వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు.. సీబీఐ నోటీసులు పంపటం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాఖీదులందుకున్న తర్వాత సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన కవిత.. కాసేపటికే దిల్లీలోని సీబీఐ డీఎస్పీ అలోక్‌కుమార్ షాహికి లేఖ రాశారు. దిల్లీ మద్యం కేసులో సీబీఐ శుక్రవారం రాత్రి సీఆర్పీసీ-160 కింద కవితకు నోటీసులు ఇచ్చింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్‌లో గానీ.. దిల్లీలో గానీ ఆమె నివాసంలో విచారించాలనుకుంటున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. దర్యాప్తు ప్రయోజనాల దృష్ట్యా పలు అంశాలపై విచారించాల్సిన అవసరం ఏర్పడిందని.. ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో తెలియజేయాలని సూచించింది. నోటీసులు అందుకున్న కవిత హైదరాబాద్‌లోని నివాసంలో వివరణ తీసుకోవచ్చని అధికారులకు వెల్లడించారు.
ఆ డాక్యుమెంట్లను పంపిన తర్వాతే వివరణ: ఈ నేపథ్యంలోనే మద్యం కేసుకు సంబంధించిన ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీలను కోరుతూ సీబీఐ డీఎస్పీకి ఆమె లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన.. ఎఫ్ఐఆర్ నకలును సాధ్యమైనంత త్వరగా తనకు అందించాలని కోరారు. తద్వారా తనకు వివరణ ఇవ్వడం తేలిక అవుతుందని తెలిపారు. ఆ డాక్యుమెంట్లను పంపిన తర్వాతే వివరణ ఇచ్చే తేదీని ఖరారు చేసి.. హైదరాబాద్‌లో కలుద్దామని వివరించారు.
సీఎం కేసీఆర్‌ను కలిసిన కవిత: కాగా నిన్న ఉదయం కవిత ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. తనకు వచ్చిన నోటీసుల ప్రతిని ఆమె సీఎంకు అందజేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను కవిత వివరించారు. ఈ సందర్భంగా ఆమెకు సీఎం ధైర్యం చెప్పినట్లు తెలిసింది. సీబీఐ నోటీసుల వెనుక దురుద్దేశం ఉందని, దానికి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయ కక్షల కారణంగా ఎదురవుతున్న సవాళ్లకు దీటుగా పోరాడాలని.. న్యాయపరంగా దీనిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సూచించినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి నివాసం నుంచి వచ్చిన తర్వాతే కవిత సీబీఐ డీఎస్పీకి లేఖ రాశారు. సీబీఐ నోటీసుల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హైదరాబాద్‌లోని కవిత నివాసానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఆమెకు, సీఎంకు అనుకూలంగా, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితకు మద్దతుగా నగరంలో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి.
ఇవీ చదవండి : దిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు
ప్రగతిభవన్‌కు ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ నోటీసులపై సీఎంతో చర్చ..!
'అందరినీ దిల్లీ రమ్మని.. కవితకు మాత్రం ఈ ఆఫర్లేంటి..?'
'ఆశీర్వాదాలే మీ పెట్టుబడి'.. 'స్టాక్ మార్కెట్' వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్.. మీరూ చూసేయండి