ప్రపంచంలో మూడు కంపెనీలు కొవిడ్ టీకాలు కనిపెడితే.. రెండు భారతదేశానివే కావడం అందులో ఒకటి హైదరాబాద్కు సంబంధించింది ఉండటం తెలుగు వారికి గర్వకారణమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ మెట్టుగూడలో పెద్ద ఎత్తున తెరాస నేతలు భాజపాలో చేరారు. వారందరికీ కాషాయ కండువాలు కప్పి కిషన్రెడ్డి.. పార్టీలోకి ఆహ్వానించారు. కరోనా కారణంగా విద్యా వ్యవస్థ, పారిశ్రామిక రంగం తదితర వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఈ సమయంలో వ్యాక్సిన్ రావడం ఉపశమనాన్ని కలిగించిందని వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించే కార్యాచరణ జరుగుతుందని తెలిపారు.
మరోసారి ఆలోచించండి
సీతాఫల్ మండిలో డంపింగ్ యార్డు నిర్మాణం విషయంలో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పోవద్దని కేంద్రమంత్రి హితవు పలికారు. ఈ అంశంపై మరొక్కసారి పునరాలోచించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: మన టీకా కోసం ప్రపంచం ఎదురుచూడటం గర్వకారణం: తమిళిసై