Traffic police special drive in Hyderabad: దిల్లీ నిర్భయ ఘటన తరువాత ఫోర్ వీల్ వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండొద్దని ట్రాఫిక్ పోలీసులు నిబంధన తీసుకొచ్చారు. భద్రతా కారణాల దృష్ట్యా కార్లలో తెరలు ఉండటం, అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వినియోగించవద్దని ఈ రూల్ తీసుకొచ్చారు. ప్రారంభంలో పోలీసులు కాస్త కఠినంగానే వ్యవహరించారు. లోపల ఉన్న వారు ఎవరో తెలుసుకునేందుకు, ముఖ్యంగా కిడ్నాప్ వంటి ఘటనల్లో లోపల ఉన్న వారిని గుర్తించేందుకు వీలుగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి మరి కార్లకున్న నల్లతెరలను తొలగించారు. ప్రారంభంలో ఫైన్ వేయకుండా హెచ్చరించిన పోలీసులు తరువాత సీరియస్‌గా వ్యవహరించారు. రూల్స్ అతిక్రమిస్తే ఫైన్ వేసేవారు.
అయితే ఇటీవల పోలీసులు ఈ విషయంపై పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో వాహనదారులు మళ్లీ కార్లకు బ్లాక్ ఫిల్మ్ వాడటం ప్రారంభించారు. ఇటీవల ఇలాంటి కార్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగటంతో... పోలీసులు మళ్లీ రంగంలోకి దిగారు. ఇవాళ హైదరాబాద్ మలక్‌పేటలో అకస్మాత్తుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
నిబంధనలకు విరుద్దంగా వాహనాల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ అమర్చుకుని వెళ్తున్న వారికి ఫైన్ వేసి షాకిచ్చారు. అక్కడికక్కడే ఫిలిం తొలగించి ఫైన్ వసూలు చేశారు. ఇలా నిబంధనలు మరోసారి ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మలక్‌పేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జ్యోత్స్న తెలిపారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు కచ్చితంగా ప్రతి వాహనదారుడు పాటించి తీరాలని చెప్పారు.
ప్రతి రోజు ఇలాంటి స్పెషల్ డ్రైవ్‌లు జరుపుతామని తెలియజేశారు. బైక్‌లు నడిపే వారు, ఇతర వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని వెల్లడించారు. అయితే బ్లాక్ ఫిల్మ్‌లు వినియోగించే వారికి ఫైన్ వేయడమే కాదు.. వాటిని అమర్చే వారిపై కూడా యాక్షన్ తీసుకోవాలని హైదరాబాద్ వాసులు కోరుతున్నారు. పోలీసులు ఈ విషయంపై కూడా దృష్టి సారిస్తే బాగుంటుంది.
ఇవీ చదవండి: