రోజురోజుకూ కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నా కొందరూ మాత్రం పట్టనట్టు ఉంటున్నారు. హైదరాబాద్‌లోని రామ్‌నగర్ చేపల మార్కెట్‌లో కొవిడ్ నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. మాస్కులు సరిగా పెట్టుకోకుండా... భౌతిక దూరం పాటించడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు వ్యాపారులు సైతం నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులూ చూసి చూడనట్టుగా వ్యవహరించడం కరోనా విస్తరణకు దోహదపడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వందలాది మంది ఒకేసారి గుమిగూడే చేపల మార్కెట్‌లో కనీస జాగ్రత్తలను పాటించట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీస ముందుచూపు కూడా జీహెచ్ఎంసీ అధికారులకు లేకుండా పోయిందని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా చేపల మార్కెట్‌లో వ్యాపారులు, వినియోగదారులు జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
ఇదీ చదవండి: జీహెచ్ఎంసీలో రానున్న 4 రోజులు శానిటైజేషన్: కేటీఆర్