Revanth Padayatra in telangana: ప్రజల్లో ఉంటూ.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. ప్రజల కోసం గొంతెత్తాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తూ త్వరలోనే తెలంగాణలో అధికారంలోకి రావాలని పావులు కదుపుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్షంలో కాకుండా అధికార పక్షంగా ఎదగాలని ఉవ్విళ్లూరుతోంది. ఎలాగైనా కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని ఆ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
Revanth Padayatra schedule: హాత్ సే హాత్ జోడో అనే కార్యక్రమం ద్వారా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. జనవరి 26 నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో 126 రోజుల్లో 99 అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టి రానున్నారు. భద్రాచలంలో మొదలయ్యే ఈ పాదయాత్ర ఆదిలాబాద్‌లో ముగుస్తుంది. రోజుకు 18 కిలోమీటర్లు 126 రోజులు పాటు పాదయాత్ర నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది.
ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ గడప గడపకూ వెళ్లాలని కాంగ్రెస్ ప్రణాళిక చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో రెండు నెలలపాటు ఈ పాదయాత్ర కొనసాగేలా ప్రణాళిక రూపకల్పన చేశారు.
అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే విధంగా పాదయాత్ర ఉండాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించాల్సి ఉన్నా.. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మార్పుతో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. పాదయాత్రకు వారంలో ఒకరోజు విరామం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యహకర్త సునీల్ కనుగోలుతో సమావేశమైన తర్వాత రేవంత్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ, పీసీసీ కార్యవర్గ కమిటీ సమావేశాల్లో ఆమోదముద్ర వేసిన తర్వాత అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.