కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలపై సీఎం కేసీఆర్ వైఖరి తెలపాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy tpcc) డిమాండ్ చేశారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపై దాడి ఘటనను ఖండించారు. సొంత భూముల్లోనే కూలీలు, బానిసలుగా మారే రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, అమిత్‌షాలకు అధికారం కట్టబెట్టిన రైతులే... ఇప్పుడు గద్దె దించాలని కంకణం కట్టుకున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్రాలు రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్ లఖింపుర్ ఘటనను నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మౌన దీక్షలో రేవంత్, భట్టి పాల్గొన్నారు.
మన సొంత భూముల్లోనే మనం కూలీలుగా, బానిసలుగా మారే... రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి... శాశ్వతంగా రైతుల జీవితం మీద మరణశాసనం రాయడానికి చట్టాలు చేశారు. ఏ రైతులైతే నరేంద్ర మోదీ, అమిత్‌షాలకు అధికారాన్ని రెండుసార్లు అప్పజెప్పారో... ఇవాళ ఆ రైతులే కంకణం కట్టుకున్నారు. అమిత్‌షా, నరేంద్ర మోదీని గద్దె దించేవరకు... రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కు తీసుకునే వరకు... బేషరతుగా ఈ చట్టాలను ఉపసంహరించుకొని రైతులకు క్షమాపణ చెప్పేవరకు వదిలేదే లేదని దేశం నలుమూలలా ధర్నాలు, దీక్షలు, రాస్తారోకోలు, బంద్‌లు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని రైతులు కూడా అందులో భాగస్వామ్యం అయ్యారు. మొదట్లో సీఎం కేసీఆర్ ఈ రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించినా అని చెప్పారు. ఆ తర్వాత రైతులకు అనుకూలంగా సీఎం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.
-రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్
మౌనదీక్ష
లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటన(Congress protest against Lakhimpur incident)కు వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు తన కారుతో రైతులను తొక్కించిన సంఘటనపై( Lakhimpur incident).. ఏఐసీసీ దేశవ్యాప్త మౌన దీక్ష నిరసనలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
దీక్షలో కాంగ్రెస్ నేతలు..
దీక్ష(Congress protest against Lakhimpur incident)లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, పీఏసీ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ, హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ యాదవ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ నేతలు మహేశ్వర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ జరిగింది..
అక్టోబరు 3న ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో(Congress protest against Lakhimpur incident) ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్ ఖేరీ జిల్లా టికునియా-బన్బీర్‌పుర్ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడి వాహనం దూసుకెళ్లింది. ప్లకార్డులు, బ్యానర్లు చేతపట్టుకొని నిరసన చేస్తున్న అన్నదాతలపైకి ఓ వాహనం వేగంగా దూసుకువచ్చింది. ఘర్షణలో(Congress protest against Lakhimpur incident) మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో నలుగురు రైతులు, ఓ పాత్రికేయుడు, ఇద్దరు భాజపా సభ్యులు, కారు డ్రైవర్ ఉన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున యూపీ ప్రభుత్వం పరిహారం అందించింది.
ఇవీ చదవండి: