తెలంగాణ మజ్దూర్ యూనియన్ ముఖ్య నాయకత్వంపై కొంతమంది నేతలు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం జరిగిన కేంద్ర కమిటీ సమావేశానికి రాకుండా.. సమస్యల పట్ల చర్చించే అవకాశం ఉన్నా.. వాటిని కాదని పదవీ కాంక్షతో, దురుద్దేశంతో ఆరోపణలు చేయడం మంచిది కాదని హితవు పలికారు.
ఆదివారం జరిగిన సమావేశంలో సమ్మె తదనంతర పరిణామాలు, కరోనా పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష చేయడం జరిగిందని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. తన నాయకత్వం మీద కేంద్ర కమిటీ ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు. తన గురించి మాట్లాడిన వారి ప్రవర్తనలో కార్మికుల సమస్యల కన్నా.. పదవీ కాంక్షే ఎక్కువ కనబడుతోందని ఆరోపించారు. అందరి అభిప్రాయం మేరకు, అన్ని సంఘాల అభీష్టం మేరకే సమ్మె జరిగిందే తప్ప.. ఒక్క అశ్వత్థామరెడ్డి కోరిక మేరకు జరగలేదని స్పష్టం చేశారు.