అగ్నివేష్ మరణం ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరని లోటని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడి ఏడేళ్లయిన నిరుద్యోగ యాత్ర చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఆంధ్రప్రదేశ్ తరహాలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా తెలంగాణలోనూ ఓ చట్టం చేయాలని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనకు క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షా 48 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని... కొత్త జిల్లాలు, కొత్త మండలాల్లో దాదాపు 50వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పట్టా పుస్తకాలు, రిజిస్ట్రేషన్ల మీదనే కొత్త రెవెన్యూ చట్టంలో మార్పులు చేశారు తప్పితే... రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ చట్టంలో పరిష్కారం చూపలేదని విమర్శించారు.
సాదాబైనామా, పోడు భూములు, అసైన్డ్ భూముల, కౌలు రైతుల సమస్యలపై రెవెన్యూ చట్టంలో స్పష్టత ఇవ్వలేదని దుయ్యబట్టారు. అసైన్డ్ భూములను రైతుల దగ్గర నుంచి బెదిరించి ప్రభుత్వం తీసుకుంటుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెజస విద్యార్థి విభాగం రెండు బృందాలుగా యాత్ర చేపట్టనున్నట్లు తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు నిజ్జన రమేష్ తెలిపారు. సోమవారం రెండు బృందాలుగా యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. భువనగిరి నుంచి భూపాలపల్లి వరకు ఒక బృందం. నల్గొండ నుంచి భద్రాచలం వరకు రెండో బృందం యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 21న హాలో నిరుద్యోగి చలో అసెంబ్లీ కార్యక్రమంకు పిలుపునిచ్చినట్లు ప్రకటించారు.
ఇదీ చూడండి: తెరాస వల్లే రెవెన్యూ శాఖలో విచ్చలవిడి అవినీతి : కోదండరాం