ప్రధాన పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచార పర్వం వేడెక్కుతోంది. అధికార వైకాపా సహా ప్రతిపక్ష పార్టీల నేతలు, ఆయా పార్టీల అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
అధికార పార్టీలో మంత్రులకే బాధ్యతలు..
వైకాపా అభ్యర్థి గురుమూర్తి గెలుపే లక్ష్యంగా రాయలసీమ జిల్లాల ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి సహా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, గౌతమ్ రెడ్డి, కొడాలి నాని, పేర్నినాని, ఆది మూలపు సురేష్, కన్నబాబు ప్రచారంలో పాల్గొంటున్నారు.
లోకేశ్, పవన్ సమర శంఖారావం..
పనబాక లక్ష్మి తరఫున తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, భాజపా అభ్యర్థి రత్నప్రభ తరఫున జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు సమరశంఖారావం పూరించనున్నారు. తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చె న్నాయుడు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించారు. నిమ్మకాయల చిన్నరాజప్ప, తిరుపతి ఉప ఎన్నికల ఇంఛార్జ్ నిమ్మల రామానాయుడు కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
- ఇదీ చదవండి : బెంగళూరులో తీగ లాగితే.. తెలంగాణలో కదిలిన డొంక!