ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో కీలక నిందితురాలు దేవికారాణి తన అనుచరులతో కలిసి స్థాపించిన డొల్ల కంపెనీల ద్వారా... భారీగా లావాదేవీలు జరిపినట్టు అనిశా గుర్తించింది. ఆమెతో పాటు ఇతర అధికారులు ఇదే రీతిలో బినామీ కంపెనీలు స్థాపించి మందుల కొనుగోళ్లు జరిపినట్టు నిర్ధరణకు వచ్చింది. బినామీల ద్వారా ఎంత మేరకు లావాదేవీలు జరిగాయి, వాటి విలువెంత అని తేల్చేందుకు అనిశా అధికారులు ప్రయత్నిస్తున్నారు.
నాలుగేళ్లలో రూ. 250 కోట్లు..
ఈ అంశంపై ఇప్పటి వరకు రెండుసార్లు ఎనిమిది మంది నిందితులను తమ కస్టడీలోకి తీసుకొని అనిశా అధికారులు విచారణ జరిపారు. మరోసారి దేవికారాణి, వసంత, ఇందిర తదితరులను రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ప్రైవేటు వ్యక్తులతో కలిసి నాలుగేళ్లలో సుమారు రూ. 250 కోట్లు దండుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఒక్క దేవికారాణి 38 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుండగా... మిగతా వారు ఈ తరహాలో ఎన్ని కంపెనీలు ఏర్పాటు చేశారోననే అంశంపై లోతుగా ఆరా తీస్తున్నారు.
కోట్ల అవినీతి..
ఏ దస్త్రం పట్టుకున్నా కోట్ల అవినీతి బయటపడుతోంది. వ్యాధి నిర్ధరణ కిట్ల కొనుగోళ్లలో... కోటికి పైగా దండుకున్నట్టు బయటపడింది. నాలుగేళ్లలో జరిగిన ఇలాంటి లావాదేవీలన్నీ అనిశా అధికారులు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా డొల్ల కంపెనీల ద్వారా జరిగిన అవినీతిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు నిందితుల బ్యాంకు ఖాతాలు, మందుల సరఫరా కాంట్రాక్టులు దక్కించుకున్న విధానానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరోసారి దేవికారాణి సహా ఇతర నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని అనిశా అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: మంత్రివర్గ నిర్ణయం తప్పు ఎలా అవుతుంది:హైకోర్టు