కొవిడ్ చికిత్సలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అమలు చేయకపోవడంతోపాటు, రోగుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడం వల్ల ఓ ప్రైవేటు దవాఖానాపై సర్కారు చర్యలు తీసుకుంది. సోమాజిగూడ డెక్కన్ ఆస్పత్రిలో కరోనా చికిత్సల కోసం ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విచారించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఇప్పటికే అక్కడ చికిత్సలు పొందుతున్న రోగులకు ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆస్సత్రికి తెలిపింది. వారి నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని... లేదంటే ఆసుపత్రి అనుమతులనూ రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఇవీ కారణాలు
డెక్కన్ ఆసుపత్రి తీరుపై ఇటీవలి కాలంలో వరుస ఫిర్యాదులు వచ్చాయి. ఆర్టీసీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి కరోనాతో ఆసుపత్రిలో చేరడంతో 14 రోజులకు గాను రూ.17.5 లక్షలు బిల్లులు వేసింది. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటికే కుటుంబ సభ్యులు రూ.8 లక్షలు చెల్లించారు. మిగతా మొత్తం చెల్లిస్తేనే మృతదేహం అప్పగిస్తామని పేర్కొనడంతో బంధువులు మీడియాకు తెలిపారు. దీంతో రూ.2 లక్షలు కట్టించుకొని మృతదేహాన్ని అప్పగించింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.
మరీ ఇంత దారుణమా..!
తాజాగా మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. కరోనా పాజిటివ్ నిర్ధారణ కాకుండానే కరోనాకు చికిత్స చేసి ఓ వ్యక్తికి రూ.3 లక్షల వరకు బిల్లు వేసింది. దీనిపై బాధితుడు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. తనకు కొవిడ్ తరహా లక్షణాలు ఉన్నాయని జులై 28న డెక్కన్ ఆసుపత్రిని ఆశ్రయించానన్నారు. 29న ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించగా నెగెటివ్ అని తేలిందని.. ఆ రిపోర్టును దాచిపెట్టి పాజిటివ్ వచ్చిందని నమ్మించారన్నారు. కొవిడ్ వార్డుకు తరలించి మూడు రోజుల పాటు రక్తపరీక్షలు చేశారని, ఇష్టారీతిన మందులు రాసి ఇస్తూ చికిత్సను కొనసాగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొవిఫర్ ఇంజెక్షన్ సైతం ఇచ్చారని, తనతో భారీగా ఫీజులు కట్టించారని వాపోయారు. దీనిపై సీరియస్‌గా స్పందించిన ప్రభుత్వం తొలుత విచారణకు ఆదేశించింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఇచ్చిన నివేదిక మేరకు ఆసుపత్రిని కరోనా చికిత్సల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇవీ చూడండి: కొత్త సచివాలయం ఎన్ని అంతస్తులో తెలుసా?