Chittoor Government Hospital: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్వాకం నివ్వెరపోయేలా చేసింది. వృద్ధురాలి కాలుకు జరుగుతున్న చికిత్సను మధ్యలోనే ఆపారు. యాదమరి మండలం దళవాయిపల్లికి చెందిన పుష్పమ్మ అనే వృద్ధురాలు.. గతేడాది డిసెంబరు 31న ఇంట్లో జారిపడి తొడ ఎముక వద్ద గట్టిగా తగలడంతో కుటుంబ సభ్యులు ఈ నెల నాలుగో తేదీన చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి బీపీ, షుగర్ పరీక్షలు చేసి కొద్దిరోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.
విరిగిన ఎముక ఎలా ఉందో తెలుసుకునేందుకు ఎక్స్‌రే తీయాలని చెప్పి ప్రైవేటు ఎక్స్‌రే ప్లాంటుకు రాశారు. ఎక్స్‌రే తీసుకురాగా పరిశీలించి వైద్యులు శస్త్రచికిత్స చేయాలని చెప్పి తేదీ సైతం చెప్పారు. వృద్ధురాలిని బుధవారం ఆపరేషన్ గదికి తీసుకెళ్లాక.. శస్త్రచికిత్స ప్రారంభించి మధ్యలోనే ఆపేశారు. తొడ భాగాన్ని కోసిన వైద్యులు మధ్యలోనే కుట్లు వేసి.. స్థానికంగా చికిత్స చేయలేమని, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. బాధితులు ప్రశ్నిస్తే ఎముకలు గట్టిగా లేవని చెప్పడంతో వారు ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తాను సంబంధిత వైద్యులతో మాట్లాడతానని, న్యాయం చేస్తానని సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు. ఆపై బాధితురాలిని ఆస్పత్రి వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.