supreme court rejected the petition ayyannapatrudu case: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. భూ ఆక్రమణకు పాల్పడ్డారంటూ అయ్యన్నపాత్రుడుపై సీఐడీ నమోదు చేసిన కేసు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అదే సందర్భంలో తదుపరి దర్యాప్తును కొనసాగించేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చేందుకు కూడా నిరాకరించింది.
ఎన్‌ఓసీ ఇచ్చినట్లు చెపుతున్నారని కానీ, సంబంధిత ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్.. దానిపై ఉన్న సంతకం తనది కాదని ఆయనే పిర్యాదు చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది హిరేన్ రావల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఒక అధికారి ఇచ్చిన పిర్యాదు మేరకే సీఐడీ విచారణ చేపట్టిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన 17 రోజుల్లోనే హైకోర్టు స్టే ఇచ్చినట్లు న్యాయవాది వివరించారు.
దీనికి స్పందించిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవికుమార్‌ల ధర్మాసనం నోటీసులు ఇస్తామని చెప్పింది. అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా రిమాండ్ రిపోర్ట్‌ను మేజిస్ట్రేట్ తిరస్కరించారని.. రిమాండ్‌కి ఇవ్వడం కుదరని చెప్పారని హిరేన్ రావల్ వివరించారు. తదుపరి దర్యాప్తు కొనసాగాలంటే హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం రిటనబుల్ నోటీసులు ఇస్తామని మరోసారి ప్రకటించింది.
దీనికి దర్యాప్తు కొనసాగించాలా లేదో స్పష్టత ఇవ్వాలని హిరేన్ రావాల్ కోరగా దర్యాప్తునకు అనుమతిస్తే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించినట్లు అవుతుందని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులే ఇచ్చిందని, సెక్షన్ 482 కింద దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉందని చెప్పగా.. అందుకే నోటీసులు ఇస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను జనవరిలో చేపట్టాలన్న ప్రభుత్వం తరపు న్యాయవాది విజ్ఞప్తికి స్పందిస్తూ ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: